రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు వాళ్లను సముదాయించడానికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వొద్దని తల్లులకు ఆయన సూచించారు.  

Yogi Advice For Parents : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లులందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లలు ఏడ్చినా, అలిగినా వాళ్లను ఏడవనీయండి… కానీ ఊరుకోబెట్టడానికి మాత్రం అస్సలు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వొద్దని సూచించారు. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వాడటం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా పిల్లల కళ్లు, మెదడుపై కూడా చెడు ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గిపోతుంది… అంతేకాదు ఇది నెమ్మదిగా అది ఓ వ్యసనంలా మారిపోతుందని హెచ్చరించారు. 

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం (సిరే మందిర్) 375వ వార్షికోత్సవంలో యూపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన రెండ్రోజుల మహాయజ్ఞం, ధర్మసభలో ఆయన పాల్గొన్నారు. సమాజం, యువత, కుటుంబం ప్రాముఖ్యత గురించి ఆయన వివరంగా మాట్లాడారు.

స్మార్ట్‌ఫోన్ల వల్ల నష్టమే ఎక్కువ..

ఈ రోజుల్లో అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్లు వాడటం వల్ల ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని సీఎం యోగి అన్నారు. దీనివల్ల కళ్లపై ఎఫెక్ట్ పడటమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందన్నారు. రోజూ మొబైల్ చూడటం వల్ల చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారని చెప్పారు. మొబైల్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువత తప్పుడు దారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదే సమయాన్ని మంచి పుస్తకాలు చదవడానికి, యోగా, వ్యాయామం చేయడానికి కేటాయిస్తే జీవితం మరింత బాగుంటుందని సూచించారు.

కుటుంబంతో సమయం గడపండి: యువతకు సలహా

స్మార్ట్‌ఫోన్‌ను అవసరమైనంత వరకే వాడాలని యువతకు సీఎం యోగి సూచించారు. కుటుంబంతో సమయం గడపడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. భోజనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడొద్దని హితవు పలికారు. ఎవరిదైనా ఫోన్ వస్తే, తర్వాత వాళ్లకు కాల్ చేయొచ్చని అన్నారు. దీనివల్ల కుటుంబ బంధాలు బలపడతాయని, జీవితంలో బ్యాలెన్స్ ఉంటుందని తెలిపారు. 

ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే యువతలో ఆత్మహత్యలు చేసుకునే ధోరణి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఓటమి ఎదురైతే భయపడకుండా, దానికి కారణాలు తెలుసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేయడం, పాజిటివ్ ఆలోచనలతోనే విజయం సాధ్యమవుతుందని యోగి అన్నారు.

మత్తు పదార్థాల వ్యాపారులను సమాజంలోకి రానివ్వొద్దు

దేశ శత్రువులు, మాధకద్రవ్యాల డీలర్లు యువతను మత్తుకు బానిసలను చేయాలని చూస్తున్నారని, దాన్ని మనం అడ్డుకోవాలని సీఎం యోగి అన్నారు. ఒక దేశ భవిష్యత్తును చూడాలంటే, ఆ దేశ యువతను చూడాలని చెప్పారు. యువత సరైన మార్గంలో నడిస్తేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందుకే కుటుంబం, సమాజం కలిసి మత్తు పదార్థాల వ్యాపారులను గ్రామాలు, పట్టణాల్లోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

దురాశ వీడి, పేదలకు సాయం చేయాలి

ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నా, భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. ఇక్కడి సంస్కృతి, పండుగలు, సంప్రదాయాలు, సాధుసంతుల బోధనలు మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయని చెప్పారు. సిరే మందిరం దగ్గర కోతుల గురించి ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. వాటికి రొట్టెలు వేసినప్పుడు, ఒక కోతి ముందు ఒక రొట్టెను పూర్తిగా తిన్న తర్వాతే రెండోది తీసుకుందని తెలిపారు. దీని నుంచి మనం ఒక నీతి నేర్చుకోవాలని, అవసరానికి మించి దాచుకోకూడదని అన్నారు. మనుషులు దురాశను వదిలి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే భావనను కలిగి ఉండాలని సూచించారు.

విభేదాలను కూడా కలుపుకొనిపోయేదే భారత సంస్కృతి

భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని వివరిస్తూ, ఇక్కడ ఎన్ని వైవిధ్యాలు ఉన్నా ఏకత్వం ఉందని యోగి అన్నారు. శివుడి కుటుంబాన్ని ఉదాహరణగా చెప్పారు. పార్వతీ దేవి వాహనం సింహం, శివుడి వాహనం నంది, గణేశుడి వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి. అయినా కుటుంబం మొత్తం కలిసే ఉంటుందని గుర్తుచేశారు. పరస్పర విరుద్ధ స్వభావాలు ఉన్నప్పటికీ, అందరూ కలిసికట్టుగా జీవనాన్ని సాగించడమే భారత సంస్కృతికి ప్రతీక అని వివరించారు.

ధర్మం కలుపుతుంది, కులతత్వం విడదీస్తుంది

భారతదేశంలో రుషులు, సాధువుల పరంపర ఎంతో పురాతనమైనదని సీఎం యోగి అన్నారు. వివిధ పీఠాలు, ఆశ్రమాలు సమాజానికి ఆరోగ్యం, విద్య, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పనులు చేస్తున్నాయని చెప్పారు. ధర్మం సమాజాన్ని కలిపే సాధనమని, కులతత్వం సమాజాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. అందుకే ప్రజలు పరస్పర భేదభావాలను పక్కనపెట్టి సమాజం, దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

వీరుల త్యాగాలతో నిర్మితమైన దేశమిది

ఈ దేశం వీరులు, వీరవనితల త్యాగాలతో నిర్మితమైందని చరిత్రను గుర్తుచేశారు. చిత్తోర్‌గఢ్ రాణి పద్మిని జౌహార్‌ను, రాజస్థాన్‌లోని ఎందరో వీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. సిరే మందిరం చారిత్రక వాస్తుశిల్పం, శిలాశాసనాల గురించి ప్రస్తావిస్తూ, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకెళ్తున్న భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని యోగి అన్నారు. గత ప్రభుత్వాలు సమాజాన్ని విభజించే రాజకీయాలు చేశాయని, కానీ ఇప్పుడు దేశాన్ని ఏకం చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాలకు పథకాల ప్రయోజనాలను చేరవేసిందని, దేశంలో రోడ్లు, రైల్వేలు, మెడికల్ కాలేజీలు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు.

విశ్వాసం లేనిదే సమాజం ముందుకు సాగదు

భారతదేశంలో విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రత్యేక స్థానం ఉందని యోగి అన్నారు. విశ్వాసం అనేది కేవలం మతపరమైన భావన కాదని, అది జాతీయ చైతన్యానికి కూడా ప్రతీక అని చెప్పారు. దేశ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ప్రయత్నిస్తే ఎంత పెద్ద పనులైనా సాధ్యమవుతాయని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా అలాంటి స్ఫూర్తితోనే సాధ్యమైందని గుర్తుచేశారు.