సారాంశం

జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్‌ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.
 

కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ అధికారికంగా వెల్లడించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. 

భారత్, పాక్‌లు కాల్పులు నిలిపివేయడానికి అంగీకరించాయని, ఈ విషయంలో అమెరికా కీలకంగా మధ్యవర్తిత్వం వహించిందని తెలిపారు. ట్రంప్‌ ట్వీట్ చేసిన కొద్ది సమయంలోనే భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటనలతో ఈ విషయాన్ని ధృవీకరించాయి.

భూ, గగన, సముద్ర మార్గాల్లో ఇకపై ఎలాంటి సైనిక చర్యలు ఉండవని భారత్, పాకిస్థాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOలు) సంయుక్తంగా అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో డీజీఎంఓ స్థాయిలో ఫోన్‌ ద్వారా చర్చలు జరిగాయని చెప్పారు. కాల్పుల విరమణపై ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించగా, దీనికి అనుగుణంగా సైన్యాలకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అంతేగాక, మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ డీజీఎంఓలు చర్చలు జరపనున్నట్లు కూడా విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఇలా పహల్గాం ఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలకు శాంతిపూరిత ముగింపు లభించినట్లు స్పష్టమవుతోంది. మే 12న జ‌రిగే చ‌ర్చ‌ల్లో ఎలాంటి అంశాలు తెర‌పైకి వ‌స్తాయ‌న్నది చూడాలి.