Upcoming week updates: ప్ర‌తీ వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ వారం కూడా లోక‌ల్ టూ గ్లోబ‌ల్ జ‌ర‌గ‌బోయే కొన్ని ఆస‌క్తిక‌ర ఈవెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అందరి దృష్టి బిహార్ ఎన్నిక‌ల‌పైనే

ప్ర‌స్తుతం యావత్ దేశం దృష్టి బిహార్ ఎన్నిక‌ల‌పైనే ఉంది. 243 అసెంబ్లీ స్థానాలకు జ‌ర‌గ‌నున్న ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. బిహార్ లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండ‌గా రెండు విడతల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 14న కౌంటింగ్ జ‌రుగుతుంది. దీంతో వ‌చ్చే వారం దేశ రాజ‌కీయాల‌న్ని బిహార్ చుట్టూ తిర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని చేప‌డుతున్నారు. బిహార్‌లో ఎలాగైనా జెండా ఎగ‌ర‌వేయాల‌ని ఇరు పార్టీలు క‌సితో ఉన్నాయి. మ‌రి బిహార్ ఓట‌ర్లు ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో చూడాలి.

తెలంగాణలో హాట్ టాపిక్‌గా కేబినెట్ విస్తరణ

తెలంగాణ కేబినెట్ విస్తరణ మరోసారి రాజకీయ వేడి పెంచింది. తాజాగా మైనార్టీ కోటా నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. దీంతో మిగిలిన రెండు ఖాళీలపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు నామినేటెడ్ హోదాలు ఖరారయ్యాయి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా, ప్రేమ్ సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికీ కేబినెట్ హోదా ఇచ్చినా, వారు మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేదు. దీంతో ప్రస్తుతం రెండు ఖాళీలు మాత్రమే మిగిలి ఉండటంతో, మరింత విస్తరణ జరుగుతుందా లేదా అనే సందేహం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే వారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఏపీకి మ‌ళ్లీ వ‌ర్షం ముప్పు

మొంథా తుఫాన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంత‌టి విధ్వంసం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఈ తుఫాన్ న‌ష్టం నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌క‌ముందే వాతావ‌ర‌ణ శాఖ మ‌రో హెచ్చ‌రిక చేసింది. నవంబర్ 4వ తేదీకి బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అండమాన్ ప్రాంతం చుట్టూ మేఘాలు కేంద్రీకృతమవుతూ ఉండటంతో ఇది బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని తీవ్రత పెరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పంట కోత దశలో ఉన్న రైతులకు ఈ వర్షాలు మరింత ఇబ్బందులు క‌లిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు విదర్భ–దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతున్నప్పటికీ, దాని మిగతా ప్రభావం వ‌చ్చే వారం రెండు తెలుగు రాష్ట్రాలపై వర్షాల రూపంలో కనిపించవచ్చని అంచ‌నా వేస్తున్నారు.

చెస్ ల‌వ‌ర్స్‌కి పండ‌గే

ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ మళ్లీ సందడి చేయబోతోంది. 80 దేశాల నుంచి 206 మంది ప్రముఖ ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబ‌ర్ 30న ప్రారంభం కాగా.. న‌వంబ‌ర్ 27వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీంతో ఈ వారం చెస్ ల‌వ‌ర్స్‌కి పండ‌గే అని చెప్పొచ్చు. ఈసారి భారత్‌ వేదికగా జరగడంతో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌, యువ గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ ఇరిగేశి, ప్రజ్ఞానందలపై అందరి దృష్టి ఉంది. నాకౌట్‌ విధానంలో జరిగే ఈ పోటీలో తొలి మూడు స్థానాల్లో నిలిచినవారికి 2026 క్యాండిడేట్‌ టోర్నీకి అర్హత లభిస్తుంది. గుకేశ్‌ ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌ కావడంతో, ఈసారి టైటిల్‌ సాధనపైనే ఫోకస్‌ పెట్టాడు. కాగా ఈసారి టోర్నీకి “విశ్వనాథన్‌ ఆనంద్‌ ట్రోఫీ”గా నామకరణం చేశారు. గోవాలో జరిగిన ఆరంభోత్సవంలో కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సీఎం ప్రమోద్‌ సావంత్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ పేరుతో ఈ ట్రోఫీని పెట్టడం భారత చెస్‌ గౌరవాన్ని మరింత పెంచింది.

అల్ ఖైదా చేతుల్లోకి ఆ దేశం.?

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాద సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమీన్‌ (JNIM) ఆధిపత్యం పెరుగుతోంది. అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న ఈ గ్రూప్ రాజధాని బమాకోను ముట్టడి చేసి, దాదాపు నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ పరిణామం కొనసాగితే, అల్-ఖైదా నియంత్రణలోకి పూర్తిగా వెళ్లే తొలి దేశంగా మాలి మారే అవకాశం ఉందని పాశ్చాత్య నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ వారం ఇందుకు సంబంధించి కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో సినిమాలివే..

జీ5

రంగ్‌బాజ్‌: ది బిహార్‌ చాప్టర్‌ – అక్టోబర్ 31

భాయ్‌ తుజైపాయి (మరాఠీ) – అక్టోబర్ 31

మారిగల్లు (తెలుగు) – అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హెడ్డా (అమెరికన్) – అక్టోబర్ 29

హెజ్బిన్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌) – అక్టోబర్ 29

కాంతార: చాప్టర్‌ 1 (తెలుగు) – అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌

ది అసెట్‌ (ఇంగ్లీష్‌) – అక్టోబర్ 27

ది మాన్‌స్టర్‌ ఆఫ్‌ ఫ్లోరెన్స్‌ (తెలుగు) – అక్టోబర్ 22

ఇడ్లీ కొట్టు (తెలుగు) – అక్టోబర్ 29

బల్లాడ్‌ ఆఫ్‌ ఎ స్మాల్‌ ప్లేయర్‌ (హాలీవుడ్‌) – అక్టోబర్ 29

అలీన్‌ – అక్టోబర్ 30

జియో హాట్‌స్టార్‌

లోక చాప్టర్‌ 1: చంద్ర (తెలుగు) – అక్టోబర్ 31

మానా కీ హమ్ యార్ నహీన్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) – అక్టోబర్ 29

ఆహా

తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ఫినాలే (రియాలిటీ షో) – నవంబర్ 1

ఈటీవీ విన్‌

రిద్ది (కథా సుధ) – అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.