మీ వాట్సాప్‌కి కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? క్లిక్ చేశారో మీ ఖాతా ఖాళీ
Whtsapp scam: మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. రోజుకో కొత్త రకం మోసంతో ప్రజలను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ మోసం ఏంటంటే.?

వాట్సాప్‌లో కొత్త స్కామ్
ఇటీవల చాలా మందికి వాట్సాప్‌లో “RTO చలాన్” లేదా “PM Kisan” పేరుతో లింక్‌లు వస్తున్నాయి. మెసేజ్‌లో.. “మీ వాహనంపై చలాన్ వచ్చింది, వెంటనే చూసుకోండి లేదంటే FIR పడుతుంది.” అని మెసేజ్ లో పేర్కొంటున్నారు. ఆ లింక్ క్లిక్ చేసి పేమెంట్ చెల్లించాలని సదరు మెసేజ్ సారాంశం.
యాప్ డౌన్‌లోడ్ చేస్తే అంతే సంగతులు
వాట్సాప్‌కు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే వెంటనే ఒక ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. SMS చదవడం, SMS పంపడం, Contacts, Notifications పర్మిషన్స్ అడుగుతుంది. దీంతో మీ ఫోన్‌లోని బ్యాంకు ఓటీపీలు, మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి. మీ ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు పోవచ్చు. ఇటీవల ఇలాంటి స్కామ్‌లో పలువురు లక్షల రూపాయల్లో కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
ఫోన్ హ్యాక్ అయినట్లు ఎలా తెలుస్తుంది.?
* మీ ఫోన్ పదే పదే హ్యాంగ్ అవ్వడం.
* ఫోన్ ఉపయోగించకపోయినా బ్యాటరీ వేగంగా డిచ్చార్జ్ అవుతుంది.
* వ్యక్తిగత సమాచారం, కాంటాక్టులు, మెసేజ్‌లు లీక్ అవ్వడం.
* మీ పేరుతో లేదా మొబైల్ నెంబర్‌తో ఇతరులకు మెసేజ్‌లు వెళ్లడం. వంటివి జరుగుతాయి.
వెంటనే ఏం చేయాలి..
APK డౌన్‌లోడ్ అయితే వెంటనే డిలీట్ చేయండి. ఒకవేళ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే.. ఆ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి. బ్యాంక్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోండి. మీకు తెలియకుండా ఏమైనా లావాదేవీలు జరిగితే బ్యాంక్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. పోలీస్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయండి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో కంప్లైట్ చేయొచ్చు.
మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లో యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సాప్‌లో వచ్చే APK లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఫోన్‌లో “Unknown sources” ఎప్పటికీ ఆన్ చేయవద్దు. అవసరమైతే తాత్కాలికంగా ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేయండి. యాప్ అనుమతులు (SMS, Contacts) అడిగితే ఒక నిమిషం ఆలోచించండి.. నిజంగా ఆ యాప్‌కు అవి అవసరమైతేనే ఇవ్వండి. ఫోన్‌లో ఏటీఎమ్ పిన్‌లు లేదా పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకండి.