వాజ్‌పేయి సర్కార్‌పై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టినప్పుడు.. తాము నిజాయితీగా వ్యవహరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.  కాంగ్రెస్‌లా తాము జిమ్మిక్కులు చేయలేదని..నాడు ఒక్క ఓటుతో మా ప్రభుత్వం పడిపోయిందని.. ప్రజలకు అంతా తెలుసునని , వాళ్లు అన్నీ చూస్తున్నారని అమిత్ షా వెల్లడించారు. 

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెచ్చిపోయారు. విపక్షాలపై పంచ్‌ల వర్షం కురిపించారు. దేశ ప్రజలకు మోడీపై సంపూర్ణ విశ్వాసం వుందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు, ఈ సభకు అవిశ్వాసం లేదన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీలో లేదని.. మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చారిత్రాత్మకమైనని అమిత్ షా స్పష్టం చేశారు. ఆనాడు ఆగస్ట్ 9న గాంధీజీ క్విట్ ఇండియాకు పిలుపునిచ్చారని.. ఇప్పుడు మోడీ కూడా క్విట్ ఇండియాకు పిలుపునిస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. పీవీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు గెలిచారు కానీ.. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు జైలుకెళ్లారని అమిత్ షా గుర్తుచేశారు. డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారని వారిపై ఆరోపణలు వచ్చాయన్నారు. 

వాజ్‌పేయి సర్కార్‌పై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టినప్పుడు.. తాము నిజాయితీగా వ్యవహరించామని అమిత్ షా వెల్లడించారు. కాంగ్రెస్‌లా తాము జిమ్మిక్కులు చేయలేదని.. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ అని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హోంమంత్రి పేర్కొన్నారు. నాడు ఒక్క ఓటుతో మా ప్రభుత్వం పడిపోయిందని.. ప్రజలకు అంతా తెలుసునని , వాళ్లు అన్నీ చూస్తున్నారని అమిత్ షా వెల్లడించారు. అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలమెంతో తెలుస్తుందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా వుందని , తాము తాయిళాలను పంచడం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. 

Also Read: స్త్రీ ద్వేషి.. రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ స్మృతి ఇరానీ ఆగ్రహం.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు..

రుణమాఫీలపై తమకు నమ్మకం లేదని.. ఎవరూ లోన్ తీసుకోకూడదు అన్నదే మా ఉద్దేశం అని హోంమంత్రి పేర్కొన్నారు. సాగుకు ఇబ్బంది లేకుండా రైతులకు సాయం అందిస్తున్నామని.. యూపీఏ రూ.70 వేల కోట్ల రుణమాఫీ తాయిళాలిచ్చిందని అమిత్ షా వెల్లడించారు. జన్ ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని.. డీబీటీ ద్వారా జన్‌ధన్ యోజనలో డబ్బులు జమ అవుతున్నాయని హోంమంత్రి పేర్కొన్నారు. మీరు చాలా చెప్పారు కానీ.. ఏదీ చేయలేదని, తాము చేసి చూపించామని ఆయన చురకలంటించారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు అది మోడీ వ్యాక్సిన్ అని దానిని తీసుకోవద్దని చెప్పారని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఒక ఎంపీ 13 సార్లు రీ లాంచ్ అయ్యాడని, 13 సార్లు ఫెయిల్ అయ్యాడని ఆయన పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ కాదు.. రుణభారం లేకుండా చేశామని ఆయన పేర్కొన్నారు. 

మేడిన్ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్, అఖిలేష్ తప్పుబట్టారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ తిరుగులేని శక్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉచితాలకు తాము వ్యతిరేకమని.. కరప్షన్ కాంగ్రెస్ క్యారెక్టర్ అని అమిత్ షా సెటైర్లు వేశారు. పాక్ భూ భాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేశామని.. 7 కీలకమైన రంగాల్లో ప్రధాని మోడీ బలమైన పునాది వేశారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ 14 దేశాల నుంచి అత్యున్నత గౌరవాన్ని పొందారని అమిత్ షా చెప్పారు. ఎంఎస్‌పీ విషయంలో విపక్షాలు రాజకీయం చేశాయని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక 4 వేల మంది టెర్రరిస్టును మట్టుబెట్టామని.. పీఎఫ్ఐని నిషేధించామని మోడీ చెప్పారు.