కేంద్ర ప్రభుత్వంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడివేడి చర్చ సాగుతుంది. రెండో రోజు చర్చలో భాగంగా  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడివేడి చర్చ సాగుతుంది. రెండో రోజు చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఎంపీగా అనర్హత వేటు ఎత్తివేత తర్వాత లోక్‌సభలో రాహుల్ చేసిన తొలి ప్రసంగం ఇది. తన ప్రసంగంలో మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే తన ప్రసంగం తర్వాత రాహుల్ పార్లమెంట్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజస్తాన్‌లో షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

అయితే లోక్‌సభ‌లో ప్రసంగం తర్వాత సభలో నుంచి వెళ్లిపోయే ముందు.. రాహుల్ అధికార పార్టీ సభ్యుల వైపు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీని ట్రెజరీ బెంచ్‌ల వైపు ఫ్లైయింగ్ కిస్ ఊదారని ఆరోపించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఆయనను ‘మహిళా ద్వేషి’ అని విమర్శించారు. 

‘‘నేను ఒకదానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినవాడు వెళ్లేముందు అసభ్యత ప్రదర్శించాడు. మహిళా పార్లమెంటేరియన్‌లకు స్త్రీ ద్వేషపూరిత పురుషుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగలడు. దేశంలోని పార్లమెంట్‌లో ఇలాంటి అప్రతిష్ట ప్రవర్తన మునుపెన్నడూ చూడలేదు. ఇది అసభ్యకరం’’ అని రాహుల్ పేరు ప్రస్తావించకుండానే స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. 

YouTube video player

స్మృతి ఇరానీ తన అభ్యంతరాన్ని లేవనెత్తిన తర్వాత బీజేపీ మహిళా ఎంపీలు.. ఇందుకు సంబంధించి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ మహిళా ఎంపీలు ఓ లేఖపై సంతకం చేసి రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘‘మహిళా సభ్యులందరికీ ఫ్లైయింగ్ కిస్‌ ఇచ్చి రాహుల్‌ వెళ్లిపోయారని.. ఇది ఇది ఓ సభ్యుడి అనుచితమైన, అసభ్య ప్రవర్తన అని సీనియర్‌ సభ్యులు చెబుతున్నారు. భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఏంటి ఈ ప్రవర్తన?.. ఎలాంటి నాయకుడు?.. అందుకే సీసీటీవీ ఫుటేజీ తీసి ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకోవాలని మేం ఏం డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. 

ఇదిలాఉంటే, 2018లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ సీటు వద్దకు వెళ్లి కౌగిలించుకున్న సంగతి తెలిసిందే.