అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ప్రతిఘటన మధ్యే అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ తతంగాన్ని కేవలం కొద్దిక్షణాల్లోనే అధికారపక్షం పూర్తి చేసింది. రాజ్యసభలో ప్రకటన వెలువడటం దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం, గెజిట్‌లో ప్రచురించడం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది.

దీంతో జమ్మూకాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవటంతో పాటు మూడు ముక్కలైంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఇక నుంచి తన మునుగడ సాగించనుంది.

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లభించనున్నాయి. కాశ్మీర్ సరిహద్దుల మార్పుతో పాటు ఎమర్జెన్సీ విధించే అధికారాలు ఉంటాయి.

దీనికి తోడు పార్లమెంటులో చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు చేసే వీలు భారత ప్రభుత్వానికి దక్కుతుంది. ఆర్టికల్ 370 రద్దుపై పదిరోజుల నుంచి పావులు కదిపిని కేంద్రం ఎట్టకేలకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పని పూర్తి చేసింది. 

చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా లఢఖ్ ఉండనుంది. అయితే జమ్మూకాశ్మీర్‌కు అసెంబ్లీతో పాటు కేంద్రపాలిత ప్రాంత హోదా ఉంటుంది. మొత్తం మీద జమ్మూకాశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంటాయి. 

ఆర్టికల్ 370 రద్దుతో పీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకుని పీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పీడీపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్‌ను రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

జమ్మూకశ్మీర్‌ను మూడు కుటుంబాలు దోచుకున్నాయని అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని అమిత్ షా ప్రకటించారు. లఢఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ పక్షనేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే  బీజూ జనతాదళ్, అన్నాడీఎంకే, బీఎస్పీ పార్టీలు ఆర్టికల్ 370 రద్దుకు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం