శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం తెల్లవారుజామున కాశ్మీర్ లో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు.

ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండనుందని మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఈ మేరకు ఆమె కూడ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

తమను కూడ పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి తెలిపారు. అయితే వీరిద్దరి అరెస్ట్ గురించి పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

ఆదివారం అర్ధరాత్రి గవర్నర్ సత్యపాల్ మాలిక్ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను సోమవారం నాడు మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ఆదివారం రాత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. 370, 35 ఎ అధికరణాల రద్దు లేదా నియోజకవర్గాల పునర్విభజన లేదా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించేందుకు తీసుకొనే నిర్ణయాలు లద్దాఖ్ ప్రజలపై దాడి చేయడమేనని ఈ సమావేశం అభిప్రాయపడింది.

ఈ ప్రయత్నాల వల్ల తలెత్తే పరిస్తితులను వివరించేందుకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచేందుకు భారత్, పాకిస్తాన్ లు చర్యలు చేపట్టకూడదని కోరారు.