ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.

అమర్‌నాథ్ యాత్ర రద్దు, కశ్మీర్‌లో తాజా పరిస్థితితో పాటు జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేబినెట్‌లో వాడి వేడి చర్చ జరిగింది. భద్రతా వ్యవహారాలపై సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మంత్రులకు వివరించారు.

కశ్మీర్ అంశంపై ఉభయసభల్లో అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ, 12 గంటలకు రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన చేస్తారు. దీని కారణంగా రాజ్యసభలో జీరో అవర్‌ను రద్దు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేత, ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ అధ్యక్షతన రాజ్యసభ ప్రతిపక్ష సభ్యుల సమావేశం జరిగింది. కశ్మీర్‌పై తాజా పరిస్ధితిపై ఈ భేటీలో నేతలు చర్చించారు. అక్కడ నిన్న మొన్నటి వరకు పరిస్ధితులు బాగానే  ఉన్నాయన్నారు. మరోవైపు కశ్మీర్ అంశంపై లోక్‌సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.