జమ్ముకశ్మీర్ లో మారణ హోమాలకు ఆర్టికల్ 370యే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. 

1956 నుంచి ఇప్పటి వరకు జరిగిన మారణ హోమాలకు ఆర్టికల్ 370యే కారణమంటూ ఆరోపించారు. ఆ నాటి నుంచి నేటికి కశ్మీర్ లో నెత్తురోడుతూనే ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దువల్ల ప్రజలకు మేలు జరుగుతోందని అమిత్ షా తెలిపారు.  

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై విశాఖ శారదాపీఠం స్పందించింది. ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొనియాడింది. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు అభినందనీయులు అంటూ కొనియాడారు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. 

ఆర్టికల్ 370 రద్దువల్ల జమ్ముకశ్మీర్ లో ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుంది. దేశంలోని శక్తిపీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.కశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు దోహద పడుతుంది. సర్కారు పునరుద్ధరణకు పూనుకుంటే విశాఖ శారదాపీఠం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ విదేశాంక శాఖ స్పందించింది. కశ్మీర్ అంతర్జాతీయ వివాదమని,దానితో తాము భాగస్వామిగా ఉన్నట్లు తెలిపింది. మోదీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది.

భారత్ నిర్ణయాన్ని తిప్పి కొట్టేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ నిర్ణయాన్ని తమతోపాటు కశ్మీరీలు కూడా అంగీకరించరని తెలిపింది.

 ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు గానూ కేంద్రాన్ని అభినందించారు.

ఆర్టికల్ 370 రద్దుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఇది సరికాదన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు భారత్ పై ఉన్న నమ్మకానికి గండికొట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్ లో సంక్షోభం వచ్చేలా ఉందంటూ మండిపడ్డారు

ఆర్టికల్ 370 రద్దుకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది

ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో ఈ విషయాన్ని రాజ్యసభలో రవీంద్రకుమార్ ప్రకటించారు. 

ఆర్టికల్ 370 రద్దు దృష్ట్యా ప్రధాని నరేంద్రమోడీ.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిశారు. అధికరణం రద్దుపై వారికి ప్రధాని వివరించారు. దీనితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ స్వయంగా ఫోన్ చేసి తాజా పరిస్ధితులపై ఆరా తీస్తున్నారు. 

ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతు ప్రకటించింది. రాజ్యసభలో వైసీపీ పక్షనేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే  బీజూ జనతాదళ్, అన్నాడీఎంకే, బీఎస్పీ పార్టీలు ఆర్టికల్ 370 రద్దుకు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌ను మూడు కుటుంబాలు దోచుకున్నాయని అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని హోంమంత్రి ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని అమిత్ షా ప్రకటించారు. లఢఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఆర్టికల్ 370 రద్దుతో పీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకుని పీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పీడీపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్‌ను రాజ్యసభ ఛైర్మన్ ఆదేశించారు. ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా లఢఖ్ ఉండనుంది. అయితే జమ్మూకాశ్మీర్‌కు అసెంబ్లీతో పాటు కేంద్రపాలిత ప్రాంత హోదా ఉంటుంది. 

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లభించనున్నాయి. కాశ్మీర్ సరిహద్దుల మార్పుతో పాటు ఎమర్జెన్సీ విధించే అధికారాలు ఉంటాయి.

దీనికి తోడు పార్లమెంటులో చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు చేసే వీలు భారత ప్రభుత్వానికి దక్కుతుంది. ఆర్టికల్ 370 రద్దుపై పదిరోజుల నుంచి పావులు కదిపిని కేంద్రం ఎట్టకేలకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పని పూర్తి చేసింది. 

సభ్యుల ప్రతిఘటన మధ్యే అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తతంగాన్ని కేవలం కొద్దిక్షణాల్లోనే అధికారపక్షం పూర్తి చేసింది. రాజ్యసభలో ప్రకటన వెలువడటం దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం, గెజిట్‌లో ప్రచురించడం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది.

దీంతో జమ్మూకాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవటంతో పాటు మూడు ముక్కలైంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఇక నుంచి తన మునుగడ సాగించనుంది. 

అందరూ ఊహించినట్లుగానే కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా.. బిల్లుకు 4 సవరణలు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దుకు అమిత్ షా ప్రతిపాదించడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. 

కశ్మీర్‌లో యుద్ధ వాతావరణం ఉందని ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించడంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారు. బిల్లుపై హోంమంత్రి చెప్పే సమాధానం ముందు వినాలని ఆయన సూచించారు. 

జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్ సవరణ బిల్లుతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. 

కశ్మీర్‌లో బలగాల మోహరింపు, నాయకుల అరెస్ట్ తదితర అంశాలపై  రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌పై అన్ని అంశాలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధమని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.

అమర్‌నాథ్ యాత్ర రద్దు, కశ్మీర్‌లో తాజా పరిస్థితితో పాటు జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేబినెట్‌లో వాడి వేడి చర్చ జరిగింది. భద్రతా వ్యవహారాలపై సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మంత్రులకు వివరించారు.

కశ్మీర్ అంశంపై ఉభయసభల్లో అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ, 12 గంటలకు రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన చేస్తారు. దీని కారణంగా రాజ్యసభలో జీరో అవర్‌ను రద్దు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేత, ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ అధ్యక్షతన రాజ్యసభ ప్రతిపక్ష సభ్యుల సమావేశం జరిగింది. కశ్మీర్‌పై తాజా పరిస్ధితిపై ఈ భేటీలో నేతలు చర్చించారు. అక్కడ నిన్న మొన్నటి వరకు పరిస్ధితులు బాగానే  ఉన్నాయన్నారు. మరోవైపు కశ్మీర్ అంశంపై లోక్‌సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 

జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం తెల్లవారుజామున కాశ్మీర్ లో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు.

ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండనుందని మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఈ మేరకు ఆమె కూడ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

తమను కూడ పోలీసులు అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి తెలిపారు. అయితే వీరిద్దరి అరెస్ట్ గురించి పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

ఆదివారం అర్ధరాత్రి గవర్నర్ సత్యపాల్ మాలిక్ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలను సోమవారం నాడు మూసివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ఆదివారం రాత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. 370, 35 ఎ అధికరణాల రద్దు లేదా నియోజకవర్గాల పునర్విభజన లేదా రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించేందుకు తీసుకొనే నిర్ణయాలు లద్దాఖ్ ప్రజలపై దాడి చేయడమేనని ఈ సమావేశం అభిప్రాయపడింది.

ఈ ప్రయత్నాల వల్ల తలెత్తే పరిస్తితులను వివరించేందుకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచేందుకు భారత్, పాకిస్తాన్ లు చర్యలు చేపట్టకూడదని కోరారు.

కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు జాతీయ  భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. కాశ్మీర్ లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

జమ్మూ కాశ్మీర్ లో  అమర్ నాథ్  యాత్రను నిలిపివేశారు. యాత్రికులను కూడ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం  ఈ నిర్ణయం తీసుకొందని చెబుతున్నారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం 12 :30 గంటలకు అమిత్ షా తో అజిత్  ధోవల్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సుమంత్ గోయల్ సమావేశమయ్యారు.