Omicron: గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం ఎన్నంటే?
Omicron: ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్నది. దీని వ్యాప్తి కారణంగా కోవిడ్-19 కొత్త కేసులు అధికమవుతున్నాయి. భారత్ లోనూ ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాడు గుజరాత్ మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
Omicron: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గజగజ వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ కారణంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఆదివారం నాడు గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145కు చేరుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుండి ఇటీవల గుజరాత్‌కు వచ్చిన 45 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ, అలాగే ఓ యువకుడికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో దేశంలో ఒమిక్రాన్ కేసులు 145కు పెరిగాయి. గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయుడు డిసెంబర్ 15న UK నుండి వచ్చిన వెంటనే అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతనికి RT-PCR కరోనా వైరస్ పరీక్షలో నిర్వహించారు. ఆ వ్యక్తికి కరోనా పాటివ్ గా రావడంతో శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపించారు. "ఆ వ్యక్తి శాంపిళ్లను పరీక్షించిన తర్వాత ఓమిక్రాన్ వేరియంట్‌తో సోకినట్లు కనుగొనబడింది," అని ఆనంద్ జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ MT చారి తెలిపారు. అతను అహ్మదాబాద్ నుండి రాష్ట్రంలోని ఆనంద్ నగరానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ కావడంతో విమానాశ్రయం నుంచే నేరుగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
Also Read: up assembly elections 2022: వాగ్దానాలివ్వడమే కాదు.. బ్రేక్ చేయడంలోనూ మోడీ దిట్ట: టీఎంసీ సెటైర్లు
కాగా, అతడు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడని డాక్టర్ చారి తెలిపారు. అతనితో వచ్చిన వారికి, పరిచయస్తులకు నెగటివ్ గా రావడం గమనార్హం. అలాగే, రాష్ట్రంలోని గాంధీనగర్‌కు చెందిన 15 ఏండ్ల ఓ బాలునికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆ బాలుడు ఇటీవలే యూకే నుంచి తిరిగి వచ్చాడని గాంధీనగర్ మున్సిపల్ కమిషనర్ ధవల్ పటేల్ వెల్లడించారు. ఇదిలావుండగా, దేశంలో ఇప్పటివరకు, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓమిక్రాన్ కేసులను గుర్తించారు. అధికంగా మహారాష్ట్రలో 48 కేసులు, ఢిల్లీకి 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణలో 20 కేసులు నమోదయ్యాయి. ఒక్క శనివారం రోజే మహారాష్ట్రలో మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనూ కొత్తగా ఎనిమిది కేసులు నమోదుకావడంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి పెరిగింది. కర్ణాటక, కేరళలోనూ వరుసగా ఆరు, నాలుగు కేసులు నమోదయ్యాయి.
Also Read: UP +Yogi..upyogi కాదు.. యూస్ లెస్: బీజేపీపై నిప్పులు చేరిన అఖిలేష్ యాదవ్
ఇదిలావుండగా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోది. ఇప్పటివరకు 89 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిన్నర నుంచి మూడు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని ఆయా దేశాల రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 274,542,057 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,366,779 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 246,344,528 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు టాప్-10లో ఉన్నాయి. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయనీ, జనవరి ప్రారంభంలోనే ఇది మొదలయ్యే అవకాశముందని నిపుణులు అంచానా వేస్తున్నారు.
Also Read: engineering courses: తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు చదవచ్చు.. !