engineering courses: తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు చదవచ్చు.. !
engineering courses: దేశంలో ఇప్పటివరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ కోర్సులను పలు స్థానిక భాషలతో పాటు తెలుగులోనూ చదవచ్చు. దీనికి సంబంధించి AICTE ఇప్పటికే 20 కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కాలేజీ ఇప్పటికే తెలుగులో ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించింది.
engineering courses: బీటెక్ కోర్సులను తెలుగులోనూ చదవ వచ్చు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఐఐటిలలో, ఎన్ఐటిలలో హిందీ, తెలుగుతో పాటు పలు ప్రాంతీయ భాషలలోనూ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తామని కేంద్రవిద్యాశాఖ గతేడాది డిసెంబర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 22 ప్రాంతీయ భాషలలో ఉన్నత విద్యను అందించాలని నూతన విద్యావిధానం సంకల్పించింది. కస్తూరి రంగన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ముందుకు కదులుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యానికి అనుగుణంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులకు అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 20 విద్యాసంస్థలకు స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులను అందించడానికి అనుమతులు జారీ చేసింది. తెలుగు మాధ్యమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ఆర్ఐ కాలేజీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో బీటెక్ కోర్సులను ఎన్ఆర్ఐ కాలేజీ ప్రారంభించింది. ఏడాది కంప్యూటర్ సైన్సు (సీఎస్‌ఈ) కోర్సును తెలుగులో ప్రారంభించింది.
Also Read: Rajnath Singh: జాతీయ భద్రతకే తొలి ప్రాధాన్యం.. భారత్‌లోనే ఆయుధాల తయారీ..
తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్ కోర్సులు ఈ కాలేజీలో ప్రారంభమవుతున్నాయి. సదరు కాలేజీలో తెలుగు మాధ్యమ సీఎస్‌ఈలో 60 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో 20 మంది, స్పాట్ కింద 11 మంది ప్రవేశాలు పొందారు. తరగతులు సైతం ఇప్పటికే ప్రారంభించారు. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు ఉన్న కోర్సులకే ప్రాంతీయ భాషల్లో సెక్షన్లకు అనుమతించింది. ప్రాంతీయభాషల్లో బోధనకు సంబంధించిన పుస్తకాలు, ఇతర మెటిరీయల్స్ ను ఏఐసీటీఈ అందజేస్తుంది. తెలుగుతో పాటు ఆంగ్ల భాషను కలిపి బోధన సాగించనున్నారు. పరీక్షల్లో ప్రశ్నపత్రాలను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లోనూ ఇస్తారు. విద్యార్థులు తమకు నచ్చిన భాషలో పరీక్షలు రాసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. తెలుగులో ఇంజినీరింగ్ కోర్సులను పూర్తిచేసిన అనంతరం వారు ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. తెలుగులో సాంకేతిక విద్యను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లబ్డి చేకూరుతుందని చెబుతున్నారు.
Also Read: Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్
ప్రాంతీయ భాషను బోధనా భాషగా మార్చే కొత్త జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 20 కళాశాలలకు ప్రాంతీయ భాషలలో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కోర్సులను అందించడానికి అనుమతిని మంజూరు చేసింది. ఈ 20 కళాశాలల్లో, 10 కళాశాలలు ఇంజనీరింగ్ కోర్సును అందించడానికి హిందీని ఎంచుకున్నాయి. మిగిలిన కాలేజీలు మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలను ఎంపికచేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం జాతీయ సగటు జీఈఆర్ 27% ఉండగా.. దీన్ని రాబోయే 15 ఏళ్లలో 50 శాతానికి తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఏఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ దత్తాత్రయ సహస్రబుధే మాట్లాడుతూ.. రాబోయే అకాడమిక్ సెషన్ అవసరాలను తీర్చడానికి AICTE అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రవేశాలను పెంచడానికి ఆయా కాలేజీల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుండగా, ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సును ఎంచుకోవడానికి తల్లిదండ్రులు, విద్యార్థులు వెనుకాడుతున్నారని పలు కళాశాలల అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే కర్ణాటకలో మాత్రం స్పందన మెరుగ్గా ఉంది.
Also Read: Coronavirus: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?