పెద్ద నోట్ల రద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న సుప్రీంకోర్టు తీర్పు
పెద్ద నోట్ల రద్దును సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును జనవరి 2న వెల్లడించనున్నది. 2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 50కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.

2016 నవంబర్ 8 న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 50కి పైగా పిటిషన్ల దాఖాలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును జనవరి 2న వెల్లడించనున్నది. ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే.. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ చేయనున్నారు.
ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తూ.. 2016 నోట్ల రద్దు విధానానికి సంబంధించిన అన్ని సంబంధిత పత్రాలు , రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్‌బిఐని కోరింది. అన్ని రికార్డులను సీల్డ్ కవర్‌లో దాఖలు చేస్తామని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదనలు
సీనియర్ న్యాయవాది, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పిటిషనర్ల తరపున వాదిస్తూ..నోట్ల రద్దు విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, దానిని రద్దు చేయాలని కోర్టుకు తెలిపారు. ఇది అత్యంత దారుణమైన నిర్ణయాల ప్రక్రియ అని పేర్కొన్న మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈ ప్రక్రియ దేశంలోని న్యాయ పాలనను అపహాస్యం చేసిందని అన్నారు.
ఇక ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తన వాదనలను వినిపించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు విధానాన్ని సమర్థించారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వైపు పెద్ద ప్రయోజనాలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సాటిలేనివని అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను అమలు చేయడంతో పెద్ద నోట్ల రద్దు విఫలమైందని, అదే సమయంలో అనవసరమైన కష్టాలను తెచ్చిపెట్టిందన్న వాదన పెద్ద అపోహ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దు
నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అపూర్వ నిర్ణయం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడం. రెండు అధిక విలువ కలిగిన కరెన్సీలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల కరెన్సీని యాక్సెస్ చేయడానికి/డిపాజిట్ చేయడానికి బ్యాంకుల వెలుపల ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు.
నగదు తీసుకునేందుకు ఏటీఎం బయట జనం క్యూ కట్టారు. ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు, ముఖ్యంగా అసంఘటిత రంగం ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితమయ్యాయి. నోట్ల రద్దు ప్రక్రియలో భాగంగా అప్పటికి అమల్లో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను ఉపసంహరించుకున్న ప్రభుత్వం, రీ-మానిటైజేషన్‌లో భాగంగా కొత్త రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త సిరీస్ రూ.500 నోట్లను కూడా ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రూ.200 కొత్త కరెన్సీని కూడా ప్రవేశపెట్టింది.