అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిందో మానవమృగం. ఆ చిన్నారి పదిరోజుల పాటు చావుతో పోరాడి మంగళవారం కన్నుమూసింది. హృదయవిదారకమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హథ్రాస్ కే చెందింది కావడం మరో విషాదం. హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు. వివరాల్లోకి వెడితే..

ఉత్తర్‌ప్రదే్‌శ్‌లోని హథ్రాస్‌కు చెందిన సదరు చిన్నారి గతేడాది తన తల్లి మరణించడంతో మేనమామ ఇంటికి చేరుకుంది. అప్పటి నుంచి వాళ్లతో కలిసి అలీఘడ్‌లోని ఇగ్లాస్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో 10 రోజుల క్రితం బాధితురాలి కజిన్‌ ఒకడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 

లోకం పోకడ తెలియని ఆ పసిపాప మృగాడి దాష్టీకానికి బలైపోయింది. ఇక ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సదాబాద్‌- బల్దేవ్‌ రహదారిపై చిన్నారి మృతదేహంతో ధర్నాకు దిగారు. 

ఈ విషయంపై స్పందించిన అలీఘడ్‌ ఎస్‌ఎస్‌పీ జి. మునిరాజ్‌ ఇగ్లాస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను విధుల నుంచి తొలగించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా హథ్రాస్‌లో 20 ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా దాడి చేసి బలితీసుకున్న విషయం తెలిసింది.