Asianet News TeluguAsianet News Telugu

ఛండీగడ్ యూనివర్సిటీ: నగ్న వీడియోల లీక్ కేసులో షిమ్లాలో నిందితుడి అరెస్టు

ఛండీగడ్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనల ప్రకంపనలు దేశవ్యాపితం అయ్యాయి. విద్యార్థినుల వీడియోలు లీక్ కేసులో తాజాగా, మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. షిమ్లాకు చెందిన 23 ఏళ్ల సన్ని మెహతాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో తొలిగా వీడియోలు రికార్డు చేసిన స్టూడెంట్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
 

second arrest in chandigarh university leaked video case as man arrested from shimla
Author
First Published Sep 18, 2022, 8:04 PM IST

న్యూఢిల్లీ: ఛండీగడ్ యూనివర్సిటీ లీక్డ్ వీడియోల కేసులో షిమ్లాలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది రెండో అరెస్టు. తొలి అరెస్టు ఛండీగడ్ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెనే తోటి విద్యార్థినుల నగ్న వీడియోలు తీసి బయటకు పంపినట్టు ఆరోపిస్తున్నారు. సుమారు 60కి పైగా విద్యార్థినుల నగ్న వీడియోల (స్నానం చేస్తుండగా రహస్యంగా తీసినట్టు చెబుతున్నారు!) ను ఆమె తీసిందని చెబుతున్నారు. ఆ వీడియోలను ఆమెకు తెలిసిన ఓ వ్యక్తికి పంపిందని, ఆ వ్యక్తి వాటిని ఆన్‌లైన్‌లో వైరల్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా స్థానిక మీడియా పేర్కొంది.

తాజాగా, ఈ కేసులో నిందితుడు 23 ఏళ్ల సన్ని మెహతను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన షిమ్లాలోని రోహ్రూకు చెందినవాడు. ఈ కేసులో తొలిగా అరెస్టు చేసిన మహిళా విద్యార్థిని రోహ్రూకు చెందినవారే కావడం గమనార్హం. వీడియోలు తీసిన ఆ విద్యార్థినికి నిందితుడు సన్ని మెహతా ముందుగానే తెలుసు అని పంజాబ్ పోలీసులు ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. 

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్.. ఈ కేసులో రెండో అరెస్టు గురించి మాట్లాడారు. పంజాబ్ పోలీసులకు సహకరించాలని తాను పోలీసు అధికారులకు సూచించినట్టు చెప్పారు. విద్యార్థినుల వీడియోలను వైరల్ చేసిన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవాడేనని తనకు సమాచారం వచ్చిందని వివరించారు. దోషిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వీడియోల లీక్ విషయం తెలియగానే ఛండీగడ్ యూనివర్సిటీ మొహలీ క్యాంపస్‌‌లో విద్యార్థినులు ఆందోళనలకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఇదిలా ఉంటే ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసుకుందనే వార్తలపై యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. ఆందోళన చేస్తున్న సమయంలో ఓ విద్యార్ధిని స్పృహ తప్పి పడిపోయిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా యూనివర్శిటీ వర్గాలు ప్రకటించాయి.  ఒక్క విద్యార్ధిని తన బాయ్ ప్రెండ్ కు తన ప్రైవేట్ వీడియోలను పంపిందని యూనివర్శిటీ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఇతర విద్యార్ధినుల వీడియోలు లీకైందనిసాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని యూనివర్శిటీ మేనేజ్ మెంట్ వివరించింది.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదే విషయాన్ని  కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. తన వ్యక్తిగత వీడియోలను మాత్రేమే తన స్నేహితుడికి ఆమె పంపిందని ఆ  మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఇతర విద్యార్ధినుల వీడియోలు లేవని ఆ కథనాలు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios