బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ డెత్ మిష్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. చివరకు డ్రగ్ మాఫియా గురించి కూడా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే.. సీబీఐ దర్యాప్తును రియా చక్రవర్తి తప్పుపట్టిస్తోందంటూ.. సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికే రియా ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసిందంటూ ఆయన ఆరోపించారు.

ఇటీవల.. రియా చక్రవర్తి.. సుశాంత్ సోదరి ప్రియాంకపై ఫోర్జరీ కేసు పెట్టింది. సుశాంత్‌కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఇచ్చారని పేర్కొంటూ సుశాంత్ సోదరి ప్రియాంకపై, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్‌పై సోమవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ప్రిస్క్రిప్షన్ వచ్చిన ఐదు రోజుల్లోనే సుశాంత్ చనిపోయాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరిపై వెంటనే సరైన విచారణ జరపాలని ఆమె కోరింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపిన రియా.. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తేదీ (జూన్ 8) సుశాంత్ ముంబైలోనే ఉన్నాడని రియా పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది. కాగా ఇది తప్పుడు ఆరోపణ అని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఖండించారు. సీబీఐ దర్యాప్తుకి రియా ఆటంకం కలిగిస్తున్నారని వికాస్ సింగ్ పేర్కొన్నారు.

మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణలో భాగంగా.. తాను డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు అంగీకరించింది రియా. అయితే డ్రగ్స్ అతనికి మాత్రమే ఇచ్చానని, తాను మాత్రం తీసుకోలేదని రియా చెప్పుకొచ్చింది. దీంతో సుశాంత్ సూసైడ్ కేసులో డ్రగ్స్ కోణం ఉందని ఓ నిర్దారణకు వచ్చిన ఎన్‌సీబీ ఆఫీసర్స్ దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ కాగా, ఈ రెండు మూడు రోజుల్లో రియా చక్రవర్తిని కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది.