Indian National Congress : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలక్షన్ కమీషన్ ను టార్గెట్ చేసింది. తాజాగా ఆపార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ ఈసిపై సంచలన ఆరోపణలు చేశారు.
KNOW
Rahul Gandhi : లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ భారత ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈసి అధికార బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న రాహుల్ తాజాగా ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తమవద్ద ఈసికి వ్యతిరేకంగా అణుబాంబులాంటి సాక్ష్యాలున్నాయని... అవసరమైనప్పుడు వాటిని బైటపెడతామని రాహుల్ హెచ్చరించారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి లబ్ది చేసేందుకు ఈసి అక్రమాలకు పాల్పడిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ కి, ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉంటోందని... ఇందుకు ఈసి కారణమని రాహుల్ అంటున్నారు. ఓటింగ్ శాతం ఆలస్యంగా ప్రకటించడం, పోలింగ్ కు సంబంధించిన సిసి పుటేజీ మాయం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదవుతోందని... ఇలా ఎందుకు జరుగుతుందో ఈసి చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు.
బిజెపి అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈసి అధికారులను బెదిరిస్తోందని... అందుకే వాళ్లు ఆ పార్టీ ఎలా చెబితే అలా చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. స్వయంప్రతిపత్తి గల ఈసిని బిజెపి ప్రభావితం చేస్తోందని... అధికారులతో తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటోందని ఆరోపించారు. ఇలా మహారాష్ట్రలో దాదాపు 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారని... ఇలా పలితాన్ని మార్చేశారని రాహుల్ ఆరోపించారు.
మధ్యప్రదేశ్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుచేస్తూ ఫలితాలు వచ్చాయని... ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని రాహుల్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయన్నారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారు... దీనిపై ఈసీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు.
ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ సంస్థలా మారిపోయింది... ఆ పార్టీ గెలుపుకోసం పనిచేస్తోందన్నారు. ఒకే పేరు, ఒకే ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది.. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయన్నారు. ఇలా ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకంగా ఈసి ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం అక్రమాలను త్వరలోనే బైటపెడతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ తమకు ఇవ్వడంలేదని... ఎక్కడ తమ బండారం బైటపడుతుందోనని భయపడే ఇలా చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి, ఈసి వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా బైటపెడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
