Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ (BC Reservations) బిల్లుపై చర్చ జరగాలని, కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బలహీన వర్గాల హక్కులకు తావు లేకుండా తప్పుడు పాలన కొనసాగుతున్నదని సంచలన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు (BC Reservations)ను ఆమోదించకపోతే ప్రధాని మోదీ (PM Modi) గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన బీసీ హక్కుల ధర్నాలో పాల్గొన్న రేవంత్, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే గుజరాత్ నాయకుల గుండెల్లో మంట ఎందుకు? అని అడిగారు. దేశవ్యాప్తంగా బీసీలు పోరాటం చేస్తున్నాం కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రధానికి సవాల్
“బీసీ బిల్లు ఆమోదిస్తారా లేక గద్దె దిగుతారా?” అంటూ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. బీసీల కోసం నాలుగు కోట్ల మంది గళం కలిపారనీ, అది సామాన్య ఉద్యమం కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ‘బలహీన వర్గాల శత్రువు’గా అభివర్ణించిన రేవంత్, ఆయనకి సామాజిక న్యాయం చేసే ఆలోచనే లేదన్నారు. తెలంగాణలో ఓట్ల కోసం చెరువు ముంచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులు బీసీ హక్కుల విషయంలో నోరు మెదపకపోవడాన్ని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే, ప్రధాని మోదీని గద్దె దించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ అనుమతితో తెలంగాణలో కులగణన చేపట్టామని, ఆయన స్వప్నంతోనే 42% బీసీ కోటా బిల్లును తెచ్చామని చెప్పారు. తెలంగాణ లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఎలాగైనా విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ కోటాకు సంబంధించిన బిల్లులు నాలుగు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కోసం కోరినా, ఇప్పటివరకూ అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులతో పాటు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
