ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ఫోన్ కాల్‌తో మోదీ లొంగిపోయారని ఆరోపించారు
Rahul Gandhi : భారత్- పాకిస్తాన్ మద్య ఇటీవల ఉద్రిక్తతలపై లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క ఫోన్ కాల్‌కే మోదీ లొంగిపోయారని ఆరోపించారు.
భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ట్రంప్ ఫోన్ చేస్తే చాలు నరేంద్ర మోదీ వణికిపోయారు, చరిత్రే దీనికి సాక్ష్యం అని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తీరు ఇదేనని విమర్శించారు. ట్రంప్ 'నరేందర్ లొంగిపో' అంటే మోదీ 'సరే సార్' అన్నారని ఎద్దేవా చేశారు.
1971 యుద్ధం గుర్తు చేశారు
1971 భారత్-పాక్ యుద్ధాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అమెరికా బెదిరింపులకు లొంగకుండా భారత్ పాకిస్తాన్‌ను చీల్చి చెండాడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సింహాలు, సింహరాశులు ఏ మహాశక్తి ముందు లొంగరని అన్నారు.
బీజేపీ ప్రతిఘటన
రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ప్రతినిధి తుహిన్ సిన్హా స్పందించారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఐఎస్ఐ తరపున మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తాయని ఆరోపించారు.
ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది?
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హత్య చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించారు. అయితే దీని తర్వాత పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడులు, సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. మే 10న పాకిస్తాన్ చొరవతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది.
భారత్-పాక్ ఉద్రిక్తత, ట్రంప్ జోక్యం
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కాల్పుల విరమణ జరిగింది. మే 10న డొనాల్డ్ ట్రంప్ తానే కాల్పుల విరమణకు కారణమని ప్రకటించారు. అయితే భారత్ కాల్పుల విరమణను పాకిస్తాన్ వేడుకుంటేనే చేసామని.. అమెరికా ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. కానీ ట్రంప్ పదేపదే తనవల్లే ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని చెప్పుకుంటున్నాడు. దీంతో కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ట్రంప్ వ్యాఖ్యలను వాడుకుంటూ భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ ఎదురుదాడి చేస్తున్నారు.
