రాఫెల్ జెట్ ఒప్పందాలకు సంబంధించిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఫ్రాన్స్ నుండి భారతదేశం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై 2018 లో సుప్రీం కోర్టు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ, ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీలతో సహా మరికొందరు రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసారు. 

ఈ నేపథ్యంలో అసలు ఈ రాఫెల్ ఒప్పందం ఎలా ప్ర్రారంభమయ్యింది, కేసులు ఎప్పుడు నమోదయ్యాయి ఇతరాత్ర అంశాలను తెలుసుకుందాం. 

Also read: రాఫెల్ డీల్స్‌పై రివ్యూ పిటిషన్ల కొట్టివేత: రాహుల్ క్షమాపణకు సుప్రీం ఓకే

2007: భారత వైమానిక దళ అవసర నిమిత్తం యుపిఎ ప్రభుత్వం 126 ఫైటర్ యుద్ధ విమానాల కోసం టెండర్లను పిలిచింది .

జనవరి 2012: ఫ్రెంచ్ సంస్థ, దసో ఏవియేషన్, రాఫెల్ కోసం అతి తక్కువ ధరకు టెండర్ వేసింది. ఒప్పందం ప్రకారం, 126 జెట్‌లు అవసరం, వీటిలో 18 ఫ్లై-అవే స్థితిలో దిగుమతి చేసుకోవాలి. మిగిలిన 108 జెట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దసో  సహాయంతో భారత దేశంలో తయారు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీని దసో  హెచ్ఏఎల్  కు అందించడానికి ఒప్పుకుంది. 

2014:  హెచ్ఏఎల్ , దసో సంస్థల మధ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిగాయి. కానీ ఒప్పందంపై సంతకాలు మాత్రం చేయలేదు. 

జూన్ 2015: 126 విమానాల ఒప్పంద టెండర్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉపసంహరించుకుంది.

Also read: భారత అమ్ములపొదిలో చేరిన రాఫెల్: ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ

ఏప్రిల్ 2015: ప్రధాని నరేంద్ర మోడీ పారిస్ సందర్శించినప్పుడు 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు.

జనవరి 2016: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాన్సువా హొలాండే  భారతదేశాన్ని సందర్శించినప్పుడు  భారతదేశం, ఫ్రాన్స్ ల మధ్య రాఫెల్ జెట్ల కొనుగోలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసారు. 

ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం సుప్రీమ్ కోర్టుకెక్కింది. ఈ కేసును సుప్రీమ్ కోర్ట్ విచారణకు స్వీకరించింది. 

నవంబర్ 2018: భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాఫెల్ కేసులో విస్తృతమైన వాదనల తరువాత తీర్పును రిజర్వు చేసింది.

డిసెంబర్ 14, 2018: ఈ ఒప్పందంలో నిర్ణయ ప్రక్రియను అనుమానించాల్సిన అవసరం కనబడటం లేదని చెప్పి, రాఫెల్ ఫైటర్ జెట్ ఒప్పందంపై కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. యుద్ధ విమానాల ధరలు ఎంతుండాలో తేల్చడం తమ పని కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Also read: మోడీ ఒక దొంగ, రాఫెల్ దేశం కోసం కాదు అంబానీ కోసం: రాహుల్

ప్రభుత్వం తప్పుడు లెక్కలను సమర్పించిందని, ఆ లెక్కల్లోని వాస్తవాలను నిగ్గు తేల్చాలని కోరుతూ,  కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు రివ్యూ పిటిషన్  ను దాఖలు చేసారు. సుప్రీమ్ కోర్ట్ దీన్ని విచారణకు స్వీకరించింది. 

మే 2019: ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై విస్తృత వాదనలు విన్న తరువాత, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖ   సీక్రెట్ పత్రాలు లీకై పత్రికల్లో వచ్చిన తరువాత, రివ్యూ పిటిషన్ ను  కొట్టివేయాలని కోరుతూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

అక్టోబర్ 2019: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌లో జరిగిన ఒక  కార్యక్రమంలో ఆయుధ పూజ నిర్వహించి తొలి రాఫెల్ జెట్ డెలివరీని స్వీకరించారు.

నవంబర్ 2019: రాఫెల్ ఒప్పందాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.