పహల్గాం దాడి తర్వాత చర్య తీసుకోవడానికి పాకిస్తాన్ కి 15 రోజులు సమయం ఇచ్చానని, కానీ వాళ్ళు ఏ చర్యా తీసుకోలేదని మోడీ అన్నారు. ఉగ్రవాదం పాకిస్తాన్ కి 'అన్నం లాంటిద'ని అంటూ, ఆపరేషన్ సింధూర్ సరైన చర్య అని సమర్థించుకున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతు పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం తన రాష్ట్రంలో తొలిసారి పర్యటించిన మోడీ, పాక్ నాయకత్వం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలా స్వీకరిస్తోందని విమర్శించారు.

పాకిస్థాన్‌ టెర్రరిజాన్ని బతికేందుకు ఉపయోగిస్తున్నదని, అక్కడి ప్రజలు దీని వలన ఎదురవుతున్న భయంకరమైన ఫలితాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాలక వ్యవస్థలు, సైన్యం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్తునే నిలువునా నాశనం చేశాయని మోడీ ఎత్తిచూపారు. శాంతి పథాన్నే తమ దేశానికి మేలు చేసే మార్గంగా పాక్ ప్రజలు ఎంచుకోవాలని, లేదంటే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Scroll to load tweet…

మోడీ మాట్లాడుతూ, పాక్ ప్రజలు రోటీల కోసం జీవించాలనుకుంటున్నారా లేక తూటాలకి బలైపోవాలనుకుంటున్నారా అన్న విషయం ఆలోచించుకోవాలని అన్నారు. మే 9న భారత సరిహద్దు వద్ద పాక్ ప్రేరిత ఉగ్రవాదులు దాడికి యత్నించిన నేపథ్యంలో, భారత వాయుసేన ప్రత్యుత్తరంగా వారి వైమానిక స్థావరాలపై తీవ్ర బాంబు దాడులు జరిపిందని వివరించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడిందని, ఈ పోరాటం మానవత్వాన్ని కాపాడడానికేనని ఆయన తెలిపారు.

మీరు ఏం సాధించారు?…

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మోడీ చెప్పారు. ఇది జపాన్‌ను అధిగమించిన అనంతరం సాధ్యపడిందని గుర్తుచేశారు. ఈ సందర్భంలో పాక్ పౌరుల్ని ఉద్దేశించి "మీరు ఏం సాధించారు?" అనే ప్రశ్న వేశారు. టెర్రరిజాన్ని నమ్మిన వారు దేశ అభివృద్ధిని నిలువునా నిరోధించారని అన్నారు. పాక్ ప్రజలు దేశ భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేయాలన్నారు.

భుజ్ సభ ముందు, మోడీ కచ్ జిల్లాలో ₹50,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. దేశంలో అభివృద్ధి, శాంతికి భారత్ నిలబడుతున్నదని, టెర్రరిజం బాటలో పాక్ కొనసాగుతుండటమే అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.