జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారికంగా వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌గా పేరుగాంచిన చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 6న ప్రారంభించనున్నారు. వంతెనతో పాటు కత్రా - శ్రీనగర్ వందే భారత్ రైలు సేవ కూడా అదే రోజున ప్రారంభించనున్నారు.
చీనాబ్ వంతెన ప్రత్యేకతలు ఇవే
చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డులకెక్కింది. కశ్మీర్‌ను తొలిసారిగా భారత్లోని మిగతా రాష్ట్రాలతో రైల్వే ద్వారా నేరుగా కలిపే ప్రాజెక్ట్ ఇదే.
ఇంజనీరింగ్ అద్భుతం
ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ (USBRL) లో భాగం. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 272 కిలోమీటర్లు కాగా
ఇందులో 36 సొరంగాలు, 1000కి పైగా వంతెనలు ఉన్నాయి. చీనాబ్ వంతెన నిర్మాణానికి 30,000 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడారు. ఒక బేస్ ఫౌండేషన్ (S20) అంటే ఒక ఫుట్‌బాల్ మైదానం మూడో వంతు దాటేంత పెద్దది నిర్మించారు. ఈ వంతెన గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదు.
పలు సవాళ్లు
ఈ ప్రాజెక్ట్‌ను భూకంప ప్రభావిత ప్రాంతంలో నిర్మించడం పెద్ద సవాలుగా మారింది. అయినా భారతీయ ఇంజనీర్లు అత్యున్నత నాణ్యతతో దీన్ని పూర్తి చేశారు. ఇది భారత ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, నవ భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
నిజానికి ఈ బ్రిడ్జిని ఏప్రిల్ 19న ప్రారంభించాలనుకున్నారు, కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని పర్యటన రద్దయ్యింది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల తర్వాత ఈ ప్రాజెక్ట్ దేశ భద్రత పరంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.