ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి జి7 (G7) శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫోన్ కాల్ చేశారు. ఆ దేశంలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని తెలిపారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా తెలిపారు. ఈ విషయమై ఎక్స్‌లో పోస్ట్ చేసిన మోదీ.. “కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫోన్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించాను. ఈ నెలలో కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపాను అని మోదీ రాసుకొచ్చారు.
“ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఉన్న రెండు ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, కెనడా పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా కొత్త ఉత్సాహంతో కలిసి పని చేస్తాయి. సమ్మిట్‌లో భేటీ కావాలని ఎదురుచూస్తున్నాను,” అని మోదీ చెప్పుకొచ్చారు.
గతంలో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో పాలనలో భారతదేశానికి, కెనడాకు మధ్య సంబంధాలు మిశ్రమంగా ఉండేవి. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమ కార్యకలాపాలు, ఇతర అంతర్జాతీయ అంశాల కారణంగా సంబంధాలు మరింత దూరమైన విషయం తెలిసిందే. అయితే మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పరిస్థితులో మార్పులు వస్తాయని అంతా భావిస్తున్నారు.
జీ7 సమ్మిట్ వివరాలు:
G7 అనేది ప్రపంచంలో అత్యధిక పారిశ్రామిక అభివృద్ధి చెందిన ఏడుగురు దేశాల సంఘం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ (UK), జపాన్, యునైటెడ్ స్టేట్స్ (US), కెనడా. ఇవేకాకుండా యూరోపియన్ యూనియన్ (EU) కూడా ఇందులో పాల్గొంటుంది. అలాగే ఈ సమావేశంలో ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంక్, యూనైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలూ హాజరవుతాయి.
ఈ ఏడాది జి7 సమ్మిట్ జూన్ 15 నుండి 17 వరకు కెనడాలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ప్రాచ్య పరిస్థితులు (వెస్ట్ ఆసియా), ప్రపంచ ఆర్థిక, భద్రతా సమస్యల వంటి అంశాలపై చర్చించనున్నారు.