ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రంతా ఆపరేషన్ సింధూర్‌ను నిరంతరం పర్యవేక్షించారని ANIకి వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ విజయవంతంగా దాడులు చేయగా, ఈ ఆపరేషన్‌ ‘సిందూర్’ను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించినట్టు సమాచారం. భారత సైన్యం ఈ లక్ష్యాలను నేరుగా చేధించిన అనంతరం, పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని, భారత వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. 

ఈ దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ప్రపంచ ప్రధాన దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగిన సంగతి అమెరికా, బ్రిటన్‌, రష్యా, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలకు తెలియజేసింది. భారత్‌ చేసిన దాడులు పాక్‌ పౌరులపై, ఆర్థిక లేదా సైనిక స్థావరాలపై కాదని స్పష్టమైన మెసేజ్‌ను వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం ద్వారా విడుదల చేసింది.

ఈ దాడుల విషయమై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ కార్యదర్శితో నేరుగా మాట్లాడారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తొందరగా తగ్గిపోవాలని ఆకాంక్షించారు.

అంతేకాక, బుధవారం ఉదయం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) అత్యవసర సమావేశం జరగనుంది. ఈ భేటీలో భద్రతా పరిణామాలపై సమగ్ర సమీక్ష జరిగే అవకాశముంది.

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) అంతటా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయని ANIకి వర్గాలు ధృవీకరించాయి.

భారతదేశంలో ఉగ్రవాదానికి పాల్పడుతున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారత దళాలు ఈ ప్రదేశాలను ఎంచుకున్నాయని వర్గాలు తెలిపాయి.