పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తర్వాత మొదటిసారి సొంత రాష్ట్రానికి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. వడోదరలో రోడ్ షో నిర్వహించగా కల్నల్ సోఫియా ఖురేషీ ఫ్యామిలీతో కలిసి స్వాగతం పలికారు.
Modi Roadshow : సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం వడోదరకు చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనతరం ప్రధాని రోడ్ షో లో పాల్గొనగా భారీగా పాల్గొన్న నగర ప్రజలు పూలవర్షం కురిపించారు మోదీని చూసేందుకు ప్రజలు దారిపొడవునా ఎదురుచూసారు. ఈ సందర్భంగా అద్భుత దృశ్యం కనిపించింది.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీ అధికారి ఒకరు చాలా ఫేమస్ అయ్యారు. మీడియాముందుకు వచ్చి ఆ ఆపరేషన్ గురించి వివరించిన సోఫియా ఖురేషి యావత్ దేశానికి పరిచయం అయ్యారు. తాజాగా ఆమె ప్రధాని మోదీకీ వడోదరలో స్వాగతం పలికారు… కుటుంబసభ్యులతో కలిసి ఖురేషీ మోదీపై పూలవర్షం కురిపించారు.
వడోదర విమానాశ్రయం నుంచి వైమానిక దళ స్టేషన్ వరకు దాదాపు కిలోమీటరు మేర ప్రధాని మోదీ రోడ్ షో జరిగింది. వేలాదిమంది ప్రజలు మోదీకి జేజేలు పలికారు. మోదీ ప్రయాణించే దారిపొడవునా ప్రజలు ఎదురుచూసారు.
కల్నల్ సోఫియా సోదరుడి కామెంట్స్
రోడ్ షోలో కల్నల్ సోఫియా ఖురేషీ సోదరుడు సంజయ్ ఖురేషీ మాట్లాడుతూ… "మేం మొదటిసారి ప్రధాని మోదీని చూడటం. మాకు గర్వంగా అనిపించింది. ఆయన చేతులూపుతూ మమ్మల్ని పలకరించారు." అని ఆనందం వ్యక్తం చేసాడు.
"ఆపరేషన్ సిందూర్ గురించి వివరించే అవకాశం తన సోదరికి ఇచ్చిన ప్రభుత్వానికి, రక్షణ దళాలకు కృతజ్ఞతలు. మహిళలు ఎదుర్కొనే కష్టాలకు న్యాయం చేకూర్చడంలో ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు.
మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటన
ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వడోదర తర్వాత దహోద్, భుజ్, గాంధీనగర్‌లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు 82,950 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. దీంతో గుజరాత్ ఆర్థిక, సామాజిక ప్రగతికి మరింత ఊపు వస్తుంది.
ప్రధానికి స్వాగతం పలకడానికి స్థానికులు భారీగా తరలివచ్చారు.. వీరు రోడ్లకు ఇరువైపులా నిలబడి ప్రధానికి స్వాగతం పలికారు ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని దేశభక్తితో మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన గుజరాత్‌లో అభివృద్ధి, భద్రతకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది.


