గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముబైల్‌ ఫోన్‌ నుంచి ఒక వాట్సప్‌ గ్రూప్‌కు పోర్న్ క్లిప్‌ షేర్ అయింది. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే వాట్సాప్‌ గ్రూపు సభ్యులు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో డిప్యూటీ సీఎం స్పందించారు. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, వారిని పట్టుకోవాలని శిక్షించాలని కోరారు. ఈ మేరకు ఆయన సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.

తాను ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నానని ఫోన్ హ్యాక్ చేసిన వాళ్లు కావాలనే ‘‘ విలేజస్ ఆఫ్ గోవా’’ గ్రూపులో ఆ క్లిప్‌ను ఫార్వార్డ్ చేశారని.. మిగతా ఏ గ్రూప్‌కు దానిని పంపలేదని కవ్లేకర్ ఆరోపించారు.

ఆ క్లిప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 1:20 గంటలకు ఫార్వర్డ్ అయింది. ఆ సమయంలో తాను నిద్రపోతున్నాను. గతంలో కూడా తన పేరును, పరువును కించపరచడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని చంద్రకాంత్ ఆరోపించారు.

ఉద్దేశ్యపూర్వకంగా నా ఫోన్ హ్యాక్ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. రాజకీయ ప్రత్యర్థులు నన్ను డైరెక్ట్‌గా ఎదుర్కోలేక ఈ పని చేశారని కవ్లేకర్ ఆరోపించారు. 

మరోవైపు పోర్న్‌ క్లిప్‌ షేరింగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని మండిపడుతోంది. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ ఉద్దేశపూరకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.