ప‌ల‌హ్గామ్ ఉగ్ర‌దాడికి ధీటుగా భార‌త ఆర్మీ ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ఇండియ‌న్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇందుకు సంబంధించిన కీల‌క విష‌యాల‌ను పంచుకున్నారు. 

వైమానిక దళం విజయ గాథ

భారత వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలు బయటపెట్టారు. ఈ చర్యలో పాకిస్థాన్‌కు చెందిన కీలక సైనిక సామర్థ్యాలను భారత్ సమర్థవంతంగా లక్ష్యంగా చేసుకుందని ఆయన చెప్పారు.

పాక్ యుద్ధ విమానాలపై దాడి

ఏపీ సింగ్‌ ప్రకారం, ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్లతో పాటు మొత్తం ఆరు విమానాలు కూల్చేసిన‌ట్లు ప్ర‌కటించారు. ఇందులో ఒక పెద్ద ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (AWACS) కూడా ఉంది. ఇది పాకిస్థాన్ నిఘా వ్యవస్థకు కీలకమైన భాగం. ఈ విజయానికి రష్యన్‌ తయారీ ఎస్-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ప్రధాన కారణమని ఆయన అన్నారు.

Scroll to load tweet…

ఉగ్రవాద స్థావరాల విధ్వంసం

ఆపరేషన్‌లో మురిద్కే, బహావల్పూర్‌ సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. జైష్‌-ఎ-మహ్మద్‌ ప్రధాన కార్యాలయం పై దాడి ముందు, త‌ర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలు చుట్టుపక్కల భవనాలకు పెద్ద నష్టం జరగలేదని చూపించాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని సింగ్‌ వెల్లడించారు.

పాక్‌ ప్రతిస్పందన

భారత్‌ ప్రకటనలపై పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ స్పందించారు. తమ యుద్ధ విమానాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అంతర్జాతీయ మీడియాకు ఇప్పటికే వివరాలు అందించామని చెప్పారు. అయితే, భారత వాయుసేన ప్రకటించిన ఉపగ్రహ సాక్ష్యాలు, దాడుల వివరాలు పాక్‌ వాదనలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

90 గంట‌ల్లోనే ల‌క్ష్యం పూర్తి

పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది అమాయ‌క ప‌ర్యాట‌కులు మృతి చెందిన తర్వాత మే 7న ఆపరేషన్‌ సిందూర్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. కేవలం 80-90 గంటల్లో లక్ష్యాలను పూర్తిచేసి, పాక్‌ వైమానిక స్థావరాలకు గణనీయ నష్టం కలిగించిందని సింగ్‌ అన్నారు. ఈ చర్యతో భారత్‌ “జీరో టాలరెన్స్” విధానాన్ని మరోసారి నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు.