సారాంశం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరిట గత రెండు వారాలుగా కొనసాగిస్తున్న విస్తృత కూంబింగ్ చర్యలు మంగళవారం ఉదయం కీలక మలుపు తిరిగాయి. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
 

ఈ ఆపరేషన్‌లో ముఖ్యంగా సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సీఏఎఫ్, బస్తర్ ఫైటర్స్ బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్న మావోయిస్టుల బలగాలపై ముందస్తు సమాచారం ఆధారంగా, కేంద్ర బలగాలు దాడులు ప్రారంభించాయి. కూంబింగ్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో ఎదురుకాల్ప‌లు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. 

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుపాతరలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక మహిళా మావోయిస్టు మృతదేహం వద్ద 303 రైఫిల్‌ను గుర్తించారు. భూగర్భ బంకర్ల కోసం K9, K3 డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపగా, డ్రోన్లు, సిగ్నల్ టవర్ల సహాయంతో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు.

ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయగా, అలుబాక శివారులో మరో క్యాంపు ఏర్పాటవుతోంది. దీనివల్ల భద్రతా దళాలు ప్రాంతంపై ఆధిపత్యాన్ని సాధించాయి. ఆపరేషన్ కగార్ ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌లో ఉన్న మావోయిస్టు నేతలు, ముఖ్యంగా హిద్మా లాంటి అగ్రశ్రేణి నేతలను పట్టుకోవడమేనని సమాచారం. 

ఈ ఆపరేషన్‌ను అదనపు డీజీపీ వివేకానంద సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందరరాజ్‌లు తరచూ రంగంలోకి వెళ్లి ఆపరేషన్ పురోగతిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికీ కర్రెగుట్టలో కాల్పులు పూర్తిగా ఆగలేదు. మరికొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.