Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్తగా ఎన్నంటే?
Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ రోజువారీ కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Omicron: యావత్ ప్రపంచంపై కరోనా పంజా విసురుతోంది. మళ్లీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత నవంబర్ లో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల్లో రోజుల్లోనే కొత్త కేసులు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలు ఒమిక్రాన్ వ్యాప్తితో గజగజ వణికిపోతున్నాయి. నిత్యం లక్షల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ కేసులు గత వారం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం అధికం అవుతున్నాయి.
Also Read: AP: తాలిబన్లకు ఆ నేతలకు తేడా ఏముంది?.. ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్
భారత్ లో గత కరోనా సాధారణ కేసులతో పాటు, అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త కేసుల్లో అధికంగా దేశరాజధాని ఢిల్లీలో 2,716 కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కోవిడ్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. కొత్తగా అక్కడ 6,180 కేసులు నమోదుకావడం కరోనా వ్యాప్తికి అద్దం పడుతోంది. దేశంలో మెట్రో నగరాల్లో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Also Read: Pupunjab election 2022: నాణ్యమైన విద్య.. అంబేద్కర్ కలను సాకారం చేస్తాం: కేజ్రీవాల్
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నాయి. హర్యానాలో మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేసింది. గుర్‌గ్రామ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాల్లో ఈ ఆంక్షలు జనవరి 2 నుంచి పది రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. అదేవిధంగా మాల్స్, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.
ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 289,712,665 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనా వైరస్ తో పోరాడుతూ 5,546,079 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకిన వారిలో 25,41,52,060 మంది కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి రోజువారి కొత్త కేసులు దాదాపు 20 లక్షలకు దగ్గరగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. మరణాలు సైతం పెరుగుతున్నాయి. నిత్యం దాదాపు 10 వేల కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, అర్జెంటీనా, కొలంబియా దేశాలు టాప్ ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.