Pupunjab election 2022: నాణ్యమైన విద్య.. అంబేద్కర్ కలను సాకారం చేస్తాం: కేజ్రీవాల్
Pupunjab election 2022: ఏడాదిలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే.. నాణ్యమైన విద్యను అందిస్తామనీ, అంబేద్కర్ కలను సాకారం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Pupunjab election 2022: మరో రెండు మూడు నెలల్లో దేశంలోని పలు ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పిటికే ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త హామీలు, తాము అధికారంలోకి వస్తే తీసుకురాబోయే సరికొత్త పథకాల గురించి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యను అందిస్తామనీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ..ఆయన కలను సాకారం చేస్తామని తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రతి చిన్నారికి వారు ఎంత పేదవారైనా నాణ్యమైన విద్యను వారి వద్దకు చేరుస్తామని చెప్పారు. త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు మెరుగైన విద్యను అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలను తమ పార్టీ సాకారం చేస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు అమృత్‌సర్‌లో శ్రీ రాం తీర్ధ్ మందిర్‌ను సందర్శించారు. ఈ ఆలయ బోర్డును వాల్మీకి సమాజ్ సభ్యులతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. "నేను ప్రమాణం చేస్తున్నాను. నా జీవితంలో, దేశంలోని ప్రతి బిడ్డ, అతను ఎంత పేదవాడైనప్పటికీ, అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందిస్తాను. నేను బాబా సాహెబ్ కలను నెరవేరుస్తాను" అని మరోసారి స్పష్టం చేశారు.
అలాగే, శ్రీరామ్ తీర్థ మందిర్ ఉద్దేశించి మాట్లాడుతూ.. " సమాజ్ కా మందిర్ హై, సమాజ్ కా పవిత్ర స్థాన్ హై. సమాజ్ కో ఉస్కో చలానే కి జిమ్మెదారీ మిల్నీ చాహియే. ఇస్ బాత్ సే హమ్ పూరే తరః సెహ్మత్ హై " అని పేర్కొన్నారు. ఈ ఆలయ బోర్డును వాల్మీకి సమాజ్ సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కేజ్రీవాల్.. క్లీనర్లను పర్మినెంట్ చేస్తామని, మాన్యువల్ స్కావెంజింగ్‌కు స్వస్తి పలుకుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలతో రెచ్చిపోయారు. పంజాబ్ లోని కాంగ్రెస్ నేతలు సీఎం పదవి కోసం పాకులాడుతూ కీచులాడుకుంటున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్ మాఫియాను అణిచివేయడంలో కానీ, ప్రార్ధనా మందిరాల పవిత్రతను కాపాడటంలో కానీ ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వానికి మతవిద్వేషాల గురించి గానీ, డ్రగ్స్ గురించి గానీ పట్టింపు లేదు" అని ఆయన ఆరోపించారు. అలాగే, శనివారం తెల్లవారుజామున వైష్ణో దేవి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట బాధాకరమని పేర్కొంటూ.. మృతుల సంతాపం ప్రకటిస్తూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read: World Census: 9 సెకన్లకు ఒకరి జననం.. ప్రపంచ జనాభా ఎంతకు పెరిగిందో తెలుసా?