లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం.. అనేక రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలను వేగంగా మార్చేస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది.

గురువారం జరిగిన కేబినెట్‌ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. అంతేకాకుండా అదే సమయానికి సిద్ధూ విడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తాను ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నారు.

పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుపు తన వల్లనేనని ఉదాహరణగా చూపించారు. ఈ ఎన్నికల్లో తనకు అమరీందర్ సింగ్ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించారని.. ఈ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయాలు నమోదు చేసిందని ఆయన తెలిపారు.

తనను తేలిగ్గా తీసుకోవద్దని... పంజాబ్ ప్రజలకు తాను జవాబుదారీననని సిద్ధూ స్పష్టం చేశారు. కాగా సిద్ధూ మంత్రిత్వ శాఖను మార్చే అవకాశాలు ఉన్నట్లు కొద్దికాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జరిగే సమావేశాలకు సిద్ధూ గైర్హాజరవ్వడం ఇది రెండో సారి.