నరేంద్ర మోడీ: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
Narendra Modi Biography: ఏడు దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో మరెవరికీ దక్కనటువంటి అరుదైన, అనూహ్యమైన, అసాధారణమైన ఘనత ఆయనది. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ సువిశాల భారతదేశ ప్రధానమంత్రి కావడమంటే.. మామూలు విషయం కాదు. అటువంటి ఘనత సాధించిన ఏ వ్యక్తి. అత్యున్నత ప్రసంశలకు ఆయన అర్హుడు. ఆయననే మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అలియాస్ నరేంద్ర మోడీ(Narendra Modi). ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరు నభూతో నభవిష్యత్. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీకోసం.
Narendra Modi Biography: గుజరాత్ సీఎం దాదాపు 14 ఏళ్ల పాటు కొనసాగిన నరేంద్ర మోడీ 2014లో పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఉపయోగించుకున్న మోడీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించారు. భారతదేశ 15వ ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. విజయవంతంగా రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముచ్చటగా మూడోసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించి.. మరోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని భావిస్తున్నారు నరేంద్ర మోడీ.
బాల్యం, విద్యాభ్యాసం
నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోదీ, హీరా బెన్. వారికి మోడీ మూడో సంతానం. నరేంద్ర మోడీ వార్డ్ నగర్ లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెస్స్ ఎడ్యూకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
రాజకీయ జీవితం
ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా
ఒక మారుమూల గ్రామంలో టీ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నరేంద్ర మోడీ తన పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన కార్యకర్తగా చాలా యాక్టివ్ గా పని చేసేవారు. మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి 17 ఏళ్లలో తొలిసారి దేశ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, డార్జిలింగ్ వరకు వెళ్లారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ, అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడ నుండి బీహార్ మీదగా అప్పటి ఉత్తరప్రదేశ్లోని ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అలా 17 నుంచి 20 ఏళ్ళు వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు.
ఛాయ్ వాలాగా
నరేంద్ర మోదీ తన పర్యటనను ముగించుకొని స్వగ్రామమైన వాద్ నగర్ కి చేరుకున్నారు. అనంతరం తన తల్లి హిరాబాయి దీవెనలు తీసుకొని అహ్మదాబాద్లో తన మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటిన్ లో పనిచేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తన గురువు లక్ష్మణరావు ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి ప్రవేశించారు. సంఘ్ కార్యక్రమాల్లో చురుకగా పాల్గొంటూ అందరికీ సుపరిచితులయ్యారు. 1975లో గుజరాత్ లో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో సక్సెస్ అయ్యారు.
ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్ మోడీకి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. ఈ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘం విద్యార్థి విభాగం ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర రాజకీయ ప్రముఖలు, కార్మిక నాయకులు,సంఘ్ పెద్దలతో ఏర్పడ్డ సన్నిహితం మోడీని రాజకీయాల పట్ల ఆకర్షితులను చేశాయి.
బీజేపీ కార్యకర్తగా
1986లో ఆర్.ఎస్.ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మొదటి తరం నాయకుల్లో మోడీ ఒకరు. భాజపాలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకొని ఆ ఎన్నికల్లో భాజపాని గెలిపించడంలో మోడీ కీలకమైన పాత్ర పోషించారు. ఇలా బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఆనాటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సహం కూడా నరేంద్ర మోడీకి తోడైంది. దీంతో అనతికాలంలోనే గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో అంటే.. 1990లో ఎల్ కే అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ ఇన్ చార్జీగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.
జాతీయ నేతగా
ఆ తరువాత 1993లో బీజేపీని గుజరాత్ లో బలోపేతం చేసేందుకు మోడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు. 1995లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ కీలక పాత్ర పోషించారు. ఈ విజయం తరువాత మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. ఆ తరుణంలో ఆయనను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించింది. ఆ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టిన మోడీ ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకరావడంలో కీలక పాత్ర పోషించారు.
బీజేపీ జాతీయ కార్యదర్శిగా
అలాగే.1997లో అద్వానీ చేపట్టిన స్వర్ణజయన్త రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకొని నరేంద్ర మోడీ.. ఆ రథయాత్ర విజయవంతం కావడంలో కీలకమైన పాత్ర పోషించారనే చెప్పాలి. ఇలా నరేంద్ర మోదీ సాధించిన విజయాలను గమనించిన ఆర్.ఎస్.ఎస్, బీజేపీ నాయకత్వం ఆయనను 1998లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఈ తరుణంలో (1998, 1999లలో) జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీజేపీ నాయకత్వంలోనే ఏన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే 1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో బీజేపీని గెలిపించారు. దీంతో పార్టీలో సీనియర్ నేత కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా..
2000లో గుజరాత్‌లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. దీంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2001 అక్టోబరులో నరేంద్ర మోడీని గుజరాత్ సీఎంగా ప్రకటించి..మోడీకి సీఎం పీఠాన్ని అందించింది. ఇలా 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు.
అయితే.. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటనతో రాష్ట్రవ్యాప్తం మోడీ సీఎంగా రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఆయన రాజీనామా చేసి మరల ఎన్నికలను ఎదుర్కొన్నారు. 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాలలో విజయం సాధించడంతో మోడీ వరసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. తన అధికారాన్ని సుసిర్థం చేసుకున్నారు. గుజరాత్ ను మోడల్ స్టేట్ గా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా ఉత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఇలా నరేంద్రమోడీ 2001 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు సీఎం అయ్యారు.
ప్రధాని అభ్యర్థిగా ఎంపిక
2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ’గుజరాత్ మోడల్’ అనే అంశం ఎంతగానో ఉపకరించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. ఎల్ కే అద్వానీ వంటి సీనియర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోకున్నా.. అనంతరం ఆయన ఫాలోయింగ్, ఆయన గ్రాఫ్ ను చూసి అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. నరేంద్ర మోడీ కూడా వారణాసి నుంచి దాదాపు 5 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ప్రధానిగా ప్రత్యేక ముద్ర
బీజేపీ నాయకత్వలోనే ఎన్డీఏ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో 2014 మే 26 నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి అమలు, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరసత్వం,పారసత్వం సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకోవడం మాత్రమే కాకుండా వాటిని అమలు చేసిన ఘనత మోడీకి దక్కింది.
అలాగే.. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన,శ్రమయోగి మాన్ ధన్ యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, జన్ సురక్ష, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, మేక్ ఇన్ ఇండియా, యోగా దివస్ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అలా ప్రజల్లో దార్శనికుడుగా గుర్తింపు పొంది 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండో సారి ప్రధాని పీఠం అధిరోహించారు.
పురస్కారాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీని ఎన్నో అవార్డులు వరించాయి.
>> 2016లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్
>> 2018 ఫిబ్రవరిలో పాలస్తీనా ప్రభుత్వం ద్వారా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా
>> 2018 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి ద్వారా యూఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు
>> 2018 ఏప్రిల్, 2019లో యుఎఇచే ఆర్డర్ ఆఫ్ జాయెద్
>> 2019 ఏప్రిల్ లో రష్యాచే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ
>> 2019జూన్ లో మాల్దీవుల నుండి ఇజ్జుద్దీన్ యొక్క విశిష్ట రూల్
>> 2019ఆగస్ట్ లో బహ్రెయిన్ ద్వారాకింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్
>> 2020 డిసెంబర్ లో అమెరికా ద్వారా లెజియన్ ఆఫ్ మెరిట్
>> 2021 డిసెంబర్ లో భూటాన్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్
>> 2022 మేలో ఫిజీ ద్వారా ఆర్డర్ ఆఫ్ ఫిజీ
>> 2022లో పాపువా న్యూ గినియా ద్వారా లోగోహు ఆర్డర్
>> 2022 జూన్‌లో ఈజిప్ట్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ది నైలు
>> 2023 జూలైలో ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వారా లెజియన్ ఆఫ్ ఆనర్
>> 2023 ఆగస్టులో గ్రీస్ ద్వారా ఆర్డర్ ఆఫ్ హానర్
>> 2024 మార్చిలో భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్
వివాదాలు
నరేంద్ర మోడీ తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కొన్ని వివాదాలను ఎదుర్కొన్నారు. 2002లో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌పెస్ లో మంటలు చెలారేగడంతో దాదాపు 59 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన తరువాత గుజరాత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు, మతకల్లోలాలు చెలరేగాయి. ఈ అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. గుజరాత్ ప్రభుత్వం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ప్రతిపక్షాలు మాత్రం అల్లర్లకు సహకరించారనే ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మోడీతో సహా 61 మందిపై హత్య, కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అయితే సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ లభించింది.
నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు
>> 1987లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో చేరిక.
>> 1988-1995 మధ్య కాలంలో బీజేపీని అధికారంలోకి తీసుకరావడంలో కీలక పాత్ర
>> 1995లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో బాటు ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత.
>> 1998లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి
>> 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక.
>> 2002లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక
>> 2007లో మూడోసారి మఖ్యమంత్రిగా బాధ్యతలు
>> 2012లో నాల్గోసారి మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
>> 2013లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం.
>> 2013లో భాజపా ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు
>> 2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక.
>> 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలుపు
>> 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం
>> 2019 లో రెండో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- Narendra Modi
- Narendra Modi Assets
- Narendra Modi Awards
- Narendra Modi Background
- Narendra Modi Biography
- Narendra Modi Educational Qualifications
- Narendra Modi Family
- Narendra Modi Political Life
- Narendra Modi Political Life Story
- Narendra Modi Prime Minister of India
- Narendra Modi Real Story
- Narendra Modi Victories
- Narendra Modi a political biography book
- Narendra Modi caste
- Narendra Modi profile
- facts about Narendra Modi