Asianet News TeluguAsianet News Telugu

డబ్బులిచ్చి టీఆర్పీలు పెంచుకుంటున్న ఛానెల్స్ : ఫేక్ రేటింగ్ స్కాం గుట్టురట్టు

నకిలీ టీఆర్‌పీ రేటింగ్స్‌ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్‌ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్‌ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు

Mumbai Police busts fake TRPs scam
Author
Mumbai, First Published Oct 8, 2020, 5:47 PM IST

నకిలీ టీఆర్‌పీ రేటింగ్స్‌ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్‌ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్‌ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్‌ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు.

ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్‌లో అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న రిపబ్లిక్ టీవీ సహా మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్‌ ఉన్నట్లు ముంబై పోలీస్ కమీషనర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు వివరించారు. 

బార్క్‌ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్‌ టీర్పీ రేటింగ్‌ వివరాలు తెలిశాయని కమీషనర్ తెలిపారు. దీనిలో బార్క్‌ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఛానల్‌ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను అరెస్ట్ చేశామని ఆయన స్పష్టం చేశారు. 

అయితే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై తాము కవరేజ్ చేస్తుండటం వల్ల మహారాష్ట్ర సర్కార్ తమపై కక్షగట్టిందని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. ఇది కేవలం కక్షపూరిత చర్యలేనని, దీనిని తాము తేలిగ్గా వదలబోమని పరువు నష్టం దావా వేస్తామని గోస్వామి ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios