26/11 Mumbai Attacks: ఆర్ఎస్ఎస్ ప్లాన్ అని నిందలు వేసిన కాంగీలను మరువొద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ముంబయి ఉగ్రదాడితో పౌరులు మరణించి, ఉగ్రవాదులను నిలువరిస్తూ నేలకొరిగిన పోలీసులను తలుస్తూ దేశమంతా శోక సంద్రంలో మునిగినప్పుడు కాంగ్రెస్ మాత్రం ఆ దాడులు ఆర్ఎస్ఎస్ కుట్ర అని వ్యాఖ్యలు చేసిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీని కౌగిలించుకుంటున్నదని, వారిని సోదరుడా అని కూడా పిలుస్తున్నదని మండిపడ్డారు.
 

mumbai attacks.. union minister rajeev chandrasekhar slams congress

న్యూఢిల్లీ: అమెరికా చరిత్రలో 9/11 ఘటన తరహా భారత దేశ చరిత్రలో 26/11 నిలిచింది. Pakistan నుంచి పది మంది ఉగ్రవాదులు(Terrorists) పోర్టు ద్వారా Mumbai నగరంలోకి ప్రవేశించి 2008 నవంబర్ 26న విధ్వంసం సృష్టించారు. సీఎస్‌టీ రైల్వే స్టేషన్ సహా రెండు లగ్జరీ హోటళ్లు, హాస్పిటల్, మరికొన్ని ప్రాంతాల్లో రక్తపుటేరులు పారించారు. 15 దేశాలకు చెందిన 166 మంది పౌరులను ఆ మృత్యు బేహారులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనకు నేటితో 13 ఏళ్లు దాటాయి. ఈ ఉగ్రదాడి జరిపించింది.. బీభత్సాన్ని సృష్టించింది పాకిస్తాన్ అని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ దాడులపైనా అప్పట్లో రాజకీయం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ వాగ్యుద్ధాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరోసారి గుర్తు చేశారు.

ముంబయి ఉగ్రదాడులతో మరణించిన వారిని చూసి పౌరులు తల్లడిల్లుతున్నప్పుడు.. పాకిస్తానీ టెర్రరిస్టులను నిలువరించే క్రమంలో అసువులు బాసిన పోలీసులను చూసి శోక సంధ్రంలో మునిగినప్పుడు కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను మరిచిపోవద్దని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను రక్షించడానికి కాంగీలు(కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు) 26/11 అనేది ఆర్ఎస్ఎస్ కుట్ర అని నమ్మించడానికి ప్రయత్నించారని తెలిపారు. అలాంటి కాంగ్రెస్‌ను మరిచిపోవద్దని వివరించారు. అదే కాంగ్రెస్ నేతలు నేడు పాకిస్తాన్ ఆర్మీని కౌగలించుకుని, సోదరుడు అని ప్రకటించడాన్నీ ఎప్పటికీ మరిచిపోవద్దని ట్వీట్ చేశారు. 

Also Read: 26/11 Mumbai Attacks: పాక్‌కు భారత్ సమన్లు.. ‘ద్వంద్వ వైఖరి వీడి విచారించండి’

26/11 దాడుల గురించి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ముంబయిలో ఉగ్రదాడులు జరిగాయి. అయితే, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ దాడులకు సరైన జవాబు ఇవ్వడంలో విఫలమైందని ఆయన కొత్తగా మార్కెట్‌లోకి రాబోతున్న తన పుస్తకంలో పేర్కొన్నారు. 26/11 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకుండా సంయమనం పాటించందని అన్నారు. అయితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ పాటించే సంయమనం దాని సామర్థ్యాన్ని వెల్లడించదని, పైగా శత్రు దేశాలకు భారత్ బలహీన దేశమనే తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. 

Also Read: 26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

ముంబయిలో ఉగ్రదాడి జరిగిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిచర్యగా పాకిస్తాన్‌కు సరైన సమాధానం చెప్పి ఉండాల్సిందని ఆయన తన పుస్తకంలో అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ వ్యాఖ్యలు బీజేపీకి కలిసి రానున్నాయి. ఎందుకంటే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారత సైనికులపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడి జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడి చేసింది.

భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఈ రోజు సమన్లు జారీ చేసింది. వెంటనే 26/11 ముంబయి దాడులపై విచారణ జరపాలని పాకిస్తాన్ హైకమిషన్‌కు సమన్లు పంపింది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలనీ ఆదేశించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ లేఖలో ఈ సమన్లు జారీ చేసింది. ముంబయి ఉగ్రదాడి కేసు విచారణను వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసే ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్‌లో అనుమతించవద్దనే నిర్ణయానికి ఆ దేశం కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios