Asianet News TeluguAsianet News Telugu

26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

ముంబయి పేలుళ్లకు 13 ఏళ్లు నిండాయి. పాకిస్తాన్ నుంచి పది మంది టెర్రరిస్టులు సముద్రమార్గం గుండా ముంబయి పోర్టు నుంచి నగరంలో చేరి రక్తపుటేరులు పారించారు. ఏకకాలంలో కీలక ప్రాంతాల్లో పేలుళ్లు, విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 166 మంది మరణించారు. దాడికి పాల్పడింది పాకిస్తాన్ జాతీయులేనని, కుట్ర జరిగింది అక్కడేనని చెప్పే ఆధారాలు ఉన్నప్పటికీ ఆ దేశం ఇంకా చర్యలు తీసుకోవడం లేదు.
 

13 years to mumbai terrorists attack.. victims still waiting for justice
Author
Mumbai, First Published Nov 26, 2021, 1:10 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబయి: అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరం నిద్రకు ఉపక్రమిస్తున్నది. కానీ, ఆకస్మికంగా ఏకకాలంలో వేర్వేరు చోట్ల ఉగ్ర దాడుల(26/11 Attack)తో నగరం ఆర్తనాదాలతో నిండిపోయింది. 2008 నవంబర్ 26 రాత్రి పాకిస్తాన్ ముష్కరులు భారీ ఆయుధ సంపత్తి, పేలుడు సామగ్రితో Mumbai మహానగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, లియోపోల్డ్ కేఫ్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ మహల్ హోటల్, నారిమాన్ హౌజ్ యూదుల కమ్యూనిటీ సెంటర్, కామా హాస్పిటల్ సహా పలు చోట్ల 10 మంది ఉగ్రవాదులు బీభత్సం(Terrorists Attack) సృష్టించారు. కనిపించిన వారిని కనిపించినట్టు తుపాకులతో విచక్షణారహితంగా కాల్చేశారు. రైల్వే స్టేషన్, పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండే హోటల్, మరెన్నో చోట్ల రక్తపుటేరులు పారించారు. సుమారు 60 గంటల తర్వాత నగరం మళ్లీ బలగాల అదుపులోకి వచ్చింది. ఈ ఊచకోతలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు సంపూర్ణ న్యాయం సమకూరలేదు. ఈ దాడికి పాల్పడ్డు టెర్రరిస్టులు పాకిస్తాన్ వారేనని, కుట్ర అక్కడే జరిగిందని, అందులోనూ పాకిస్తాన్ ఆర్మీ అండ ఉన్నదని ఆధారాలున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

దాడులకు పాల్పడిన పది మంది ఉగ్రవాదుల్లో ముంబయి పోలీసులు ధైర్య సాహసాలతో ఒకరిని(అజ్మల్ కసబ్)ను పట్టుకోగలిగారు. ఈ ఘటన ముంబయి దాడుల విచారణలో గేమ్ చేంజర్‌గా మారింది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు, ఎన్ఐఏ దర్యాప్తులు జరిపాయి. అజ్మల్ కసబ్‌తోపాటు ఇద్దరు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఇద్దరు లష్కర్ ఏ తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్, కమాండర్లు జాకి ఉర్ రెహ్మన్ లఖ్వీ, జరార్ షా సహా మొత్తం 35 మందిపై ముంబయి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. డేవిడ్ హెడ్లీ, హఫీజ్ సయీద్, తహవ్వుర్ రాణా, ఇద్దరు పాక్ ఆర్మీ అధికారులు సహా మరికొందరిపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2012 నవంబర్‌లో కసబ్‌కు ఉరిశిక్ష పడింది.

Also Read: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌పై నాన్ ‌బెయిలబుల్ వారెంట్ : ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు

ఈ కేసు ఆధారాల్లో అజ్మల్ కసబ్ వాంగ్మూలం కీలకమైంది. ఆయన వాంగ్మూలం ప్రకారం కసబ్‌‌తోపాటు మరో తొమ్మిది మందికి లష్కర్ ఏ తాయిబా క్యాంపుల్లో ఉగ్ర శిక్షణ ఇచ్చారు. వారిని మురిద్కే, మన్షేరా, ముజఫరాబాద్‌లో ట్రెయినింగ్ ఇచ్చారు. శిక్షణ అనంతరం కరాచీ సమీపంలో ఆ పది మందిని ఐసొలేషన్‌లో ఉంచి పరిశీలించారు. వారి కదలికలను జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ, అబు హంజా, యూసుఫ్ అలియాస్ ముజమ్మిల్ ఖాఫా సహా లష్కర్ ఏ తాయిబా సీనియర్ నేతలు అందరూ పర్యవేక్షించారు. ఆ తర్వాత వారిని సముద్ర మార్గం గుండా ముంబయి పోర్టుకు రవాణా చేశారు. సముద్ర జలాల్లో చేపట వేటకు వచ్చిన ఎంవీ కుబేర్ అనే పడవను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ పడవలోకి ఎంటర్ కాగానే, షిప్ కెప్టెన్ ఎంవీ కుబేర్‌ అమర్ సింగ్ సోలంకిని హతమార్చాల్సిందిగా వారికి ఆదేశాలు వచ్చాయి. కెప్టెన్‌ను చంపేసి ముంబయి పోర్టుకు వారు చేరారు. సుమారు ఒక రోజు ఆ పడవలోనే వారు గడిపారు.

ఆయనతోపాటు మారణహోమానికి పాల్పడిన మిగితా తొమ్మిది మంది పేర్లను కసబ్ వెల్లడించారు. ఇస్మాయిల్ ఖాన్, బాబర్ ఇమ్రాన్, నాసర్, షోయబ్, నజీర్, హఫీజ్ అర్షద్, జావెద్, అబ్దుర్ రెహ్మాన్, ఫహదుల్లా అందరూ పాకిస్తాన జాతీయులే. వారి డీఎన్ఏ రిపోర్టును భారత్ భద్రపరిచింది. వీటితోపాటు వారు ఒక రోజు గడిపిన ఆ పడవలో వాడిని వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ పాకిస్తాన్‌తో తయారైనవే. ఆ పడవలో లభించిన శాటిలైట్ ఫోన్‌ల నుంచి పాకిస్తాన్‌లోని లష్కర్ ఏ తాయిబా సభ్యులకు పలుమార్లు ఫోన్‌లు వెళ్లాయని తేలింది. అక్కడే లభించిన జీపీఎస్ సెట్.. ఆ టెర్రరిస్టులు ముంబయిలోని బధ్వార్ పార్క్ చేరడానికి ముందస్తుగానే ప్లాన్ చేసి ఉంది. ఇది ముందస్తుగా పాకిస్తాన్‌లో జరిగిన కుట్ర అని తెలియజేస్తున్నది.

ఈ పది మంది ఉగ్రవాదులకు పేలుళ్లు జరిగుతున్నంత సేపు పాకిస్తాన్ నుంచి టెలిఫోన్ ద్వారా సూచనలు అందాయి. వారు వీవోఐపీ, వర్చువల్ నెంబర్ల ద్వారా పది మంది ఉగ్రవాదుల్లోని ఒకరితో నిరంతర సంభాషణం చేశారు. ఈ కాల్‌ను అధికారులు కనుగొనగలిగారు. వారి సంభాషణను రికార్డు చేయగలిగారు. ఈ రికార్డుల ద్వారానే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు డేవిడ్ హెడ్లీ, తహవుర్ రాణాలను అరెస్టు చేసింది.

Also Read: 26/11 ఘటనలో కసబ్‌ను గుర్తు పట్టిన హీరో: ప్రస్తుతం ఫుట్‌పాత్‌పై దయనీయ స్ధితిలో

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కర్ ఏ తాయిబాకు మధ్య సన్నిహిత సంబంధాలను డేవిడ్ హెడ్లీ విచారణలో వెల్లడించారు. ఈ రెండింటి మధ్య మెయిల్స్ కూడా ఎక్స్‌చేంజ్ జరిగినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లు ఉన్నాయి. చికాగో కోర్టుకు ఆయన ఈ ఆధారాలు అందించారు.

ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ముంబయి పేలుళ్ల కుట్రదారులు ఇంకా పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మనదేశంలో పలుసార్లు వారిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసినా పాకిస్తాన్ పట్టించుకోలేదు. అవసరమైతే ఇక్కడి సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని, లేదా వారి న్యాయ అధికారులు భారత్‌కు వచ్చి వాంగ్మూలాలు తీసుకెళ్లాలనీ సూచించింది. కానీ పాక్ చెవినపెట్టుకోలేదు. ముంబయి పేలుళ్ల కుట్రదారుల్లో కొందరు స్వేచ్ఛగా జీవిస్తుండగా మరికొందరు అమెరికాలో జైలులో ఉన్నారు. ఇంకొందరు పాకిస్తాన్‌లోనే ఏళ్ల తరబడి ‘మిస్సింగ్‌’లో ఉన్నటు ఆ దేశం చిత్రిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios