26/11 Mumbai Attacks: పాక్‌కు భారత్ సమన్లు.. ‘ద్వంద్వ వైఖరి వీడి విచారించండి’

ముంబయి ఉగ్రదాడి ఘటనకు 13ఏళ్లు నిండిన సందర్భంగా భారత ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్‌కు సమన్లు పంపింది. ముంబయి ఉగ్రదాడి కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. 15దేశాల బాధితులకు న్యాయం చేయాలని పేర్కొంది. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వకూడదనే నిర్ణయాన్ని పాకిస్తాన్ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ హైకమిషన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది.

india summons pakistan demands expidite mumbai attack case trial

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరంలో పాకిస్తాన్ ముష్కరులు మారణ హోమానికి ఒడిగట్టి 13 ఏళ్లు గడిచాయి. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు (Terrorists) ముంబయి(Mumbai) మహానగరంలో పేలుళ్లు, విచక్షణారహిత కాల్పులకు పాల్పడి భారత్ సహా 14 దేశాలకు చెందిన 166 మంది పౌరులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఉగ్రకుట్రకు రచనా పాకిస్తాన్‌లోనే జరిగిందని, ఉగ్రవాదులూ పాకిస్తానీయులేనని, శిక్షణ కూడా అక్కడే జరిగిందని అనేక ఆధారాలున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులే ఈ మారణకాండకు పాల్పడ్డారు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం ఐఎస్ఐ ప్రమేయం ఉన్నదని ఆధారాలు తేలుస్తుండగా పాకిస్తాన్ మాత్రం దోషులను విచారించకుండా మిన్నకుండిపోయింది. ఈ ఘటనకు 13ఏళ్లు గడిచిన సందర్భంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు సమన్లు జారీ చేసింది. వెంటనే 26/11 ముంబయి దాడులపై విచారణ జరపాలని పాకిస్తాన్ హైకమిషన్‌కు సమన్లు పంపింది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలనీ ఆదేశించింది.

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ లేఖలో ఈ సమన్లు జారీ చేసింది. ఆ లేఖను పాకిస్తాన్ దౌత్య అధికారికి పంపింది. ముంబయి ఉగ్రదాడి కేసు విచారణను వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసే ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్‌లో అనుమతించవద్దనే నిర్ణయానికి ఆ దేశం కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ ఘోర ఘటన జరిగి 13 ఏళ్లు గడిచినా 15 దేశాలకు చెందిన 166 మంది మృతుల కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయని, ఇది బాధాకరమని పేర్కొంది. దోషులను విచారించి శిక్షించడానికి పాకిస్తాన్ ప్రయత్నించడం లేదని, ఈ కేసుపై ఆసక్తి చూపించట్లేదని మండిపడింది.

Also Read: 26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

ముంబయి ఉగ్రదాడికి కుట్ర పాకిస్తాన్‌లోనే ప్రణాళిక రచించారని, అక్కడి నుంచే ఈ దాడిని జరిపించారని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే తన ద్వంద్వ వైఖరిని వదలాలనీ మరోసారి గట్టిగా భారత్ చెప్పింది. వెంటనే ముంబయి ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయడానికి ఉపక్రమించాలని పేర్కొంది. ముంబయి ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయడం పాకిస్తాన్ బాధ్యతనే కాదు.. అది అంతర్జాతీయ బాధ్యత కూడా అని స్పష్టం చేసింది. ఈ దాడిలో మరణించిన సాధారణ పౌరులు, వారిని కాపాడే  ప్రయత్నంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంటుందని వివరించింది.

ముంబయి ఉగ్రదాడికి 13 ఏళ్లు నిండిన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముంబయి ఉగ్రదాడిలో మరణించిన పౌరులకు ఆయన నివాళి అర్పించారు. ఆ ఉగ్రదాడి నుంచి ప్రజలను కాపాడటంలో అసమాన ధైర్యం చూపించి నేలకొరిగిన భద్రతా బలగాలకు చెందిన వారికీ నివాళి అర్పించారు. ముంబయి ఉగ్రదాడి చేసిన గాయాన్ని భారత్ ఎప్పటికీ మరిచిపోలేదని వివరించారు. కానీ, నేటి భారతం ఉగ్రవాదంపై కొత్త విధానాలతో, కొత్త మార్గాల్లో పోరాడుతున్నదని తెలిపారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios