బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి.  గాలి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాలి జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ ఆరోపణ నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు తీసుకున్నారు. 

పరారీలో ఉన్న గాలి ఆచూకీ కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు రెండు రోజులు గడిచినా గాలి ఎక్కడుంది తెలియడం లేదు. దీంతో మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోయి ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఆయన హైదరాబాదులో తలదాచుకుని ఉండవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.

సంబంధిత వార్తలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే