భద్రతా చర్యల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులను ముందస్తు ఏర్పాట్లతో 3 గంటల ముందే విమానాశ్రయానికి రావాలని సూచించాయి.

భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పరిణామాల కారణంగా ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి. ప్రయాణం చేసేవారంతా తమ విమానం టైం కంటే కనీసం మూడు గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరాలని సూచిస్తున్నారు.అకాసా ఎయిర్‌ తమ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా తాజా ట్రావెల్ అప్డేట్‌ను ప్రకటించింది. అందులో భద్రతా తనిఖీలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా, ప్రయాణికులు తమ చెక్-ఇన్ , బోర్డింగ్ ప్రక్రియలు సజావుగా సాగేలా ముందుగానే వచ్చేందుకు అభ్యర్థించారు. అలాగే చెల్లుబాటు అయ్యే ఫోటో ID తీసుకురావడం తప్పనిసరిగా పేర్కొన్నారు. ఒక్క చెక్-ఇన్ బ్యాగేజీ కాకుండా, కేవలం 7 కిలోల బరువులోపు హ్యాండ్‌బ్యాగ్ మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

http://akasaair.com

అదే విధంగా స్పైస్‌జెట్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు ముందస్తు సూచనలు చేసింది. వారు కూడా మూడు గంటల ముందుగా రావాలని, భద్రతా చర్యలు జారీ అయిన నేపథ్యంలో ఆలస్యాలు జరగవచ్చని తెలిపారు. ఇండిగో సంస్థ కూడా తమ ప్రయాణికులకు ఇదే మాదిరిగా అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సాధారణ పరిస్థితులు కావని, అందువల్ల ఎలాంటి అనవసర ఆందోళనలు లేకుండా ప్రయాణం సాగాలంటే అదనంగా సమయం కేటాయించాలని సూచించారు.

https://x.com/flyspicejet/status/1920540205070569926

ఈ భద్రతా మార్గదర్శకాలు పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో తీసుకోవడం జరిగింది. ఉరి, కుప్వారా, తంగ్ధర్, కర్నా ప్రాంతాల్లో గడచిన కొన్ని రోజులుగా కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం వల్లే భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణికులు సమయాన్ని ఆదా చేసేందుకు ఆన్‌లైన్ చెక్-ఇన్ సేవలను ఉపయోగించుకోవాలని ఎయిర్‌లైన్స్ సూచిస్తున్నాయి. పాసింజర్ల సహకారంతోనే ఈ సవాళ్లను అధిగమించవచ్చని కంపెనీలు వెల్లడించాయి.

https://x.com/IndiGo6E/status/1920535636299153693