శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ సింధూరలో మహిళా పైలట్లు కీలకంగా వ్యవహరించారు. వీరిలో వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఒకరు... ఈమె గురించి తెలుసుకుందాం.  

 Operation Sindoor : భారత ఆర్మీ ఉగ్రవాదులు ఏరివేత కోసం ఎంతో పకడ్బందీగా చేపట్టిన సైనిక చర్యే ఈ 'ఆపరేషన్ సింధూర'. శత్రుదేశం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం.. ఉగ్రమూకలను మట్టుబెట్టడమే ఈ ఆపరేషన్ ఉద్దేశం. ఇలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ ను నడిపింది మహిళలే. ఈ వీరమహిళల సాహసానికి ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. 

ఆపరేషన్ సింధూర సక్సెస్ లో వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి కీలక పాత్ర ఉందని అర్థమవుతోంది. ఈ సైనిక దాడి ఎలా జరిగిందో వీరిద్దరే సంయుక్తంగా మీడియాకు సమాచారం అందించారు. నిషేధిత జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా జరిగిన దాడిని ఈ వీరమహిళలు వివరించాు. 

ఖచ్చితమైన ఆపరేషన్‌లో ధ్వంసం చేయబడిన లక్ష్యాలలో బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా, తెహ్రా కలాన్‌లోని సర్జల్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ మరియు ముజఫరాబాద్‌లోని సయ్యద్నా బిలాల్ శిబిరం (నిషేధించబడిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవి) ఉన్నాయి. ఇలా ఉగ్రవాద స్థావరాలపై దాడి, ఉగ్రవాదుల ఏరివేతలో కీలకంగా వ్యవహరించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి తెలుసుకుందాం. 

ఎవరీ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్?

వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ కు వైమానిక దళంలో పనిచేయాలన్నది చిన్ననాటి కల. ఆమె స్కూల్ డేస్ నుండే ఆకాశంలో ఎగరాలని కలలు కనేది. అయితే ఆ కలలు ఆమెతో పాటు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో వ్యోమిక తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగు వేసింది.

తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చేరి, తన ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత అన్ని అర్హతలు సాధించి వాయుసేనలో చేరారు. ఇలా ఆ కుటుంబం నుండి సైన్యంలో చేరిన మొదటి వ్యక్తి వ్యోమిక. డిసెంబర్ 18, 2019న ఆమె హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు... తర్వాత భారత వైమానిక దళం ఫ్లయింగ్ బ్రాంచ్‌లో చేరారు. 

ఈశాన్య మరియు జమ్మూ & కాశ్మీర్ వంటి కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఆమె చీతాక్ మరియు చీతా వంటి హెలికాప్టర్లను నడిపారు. 2,500 కంటే ఎక్కువ గంటలు నడిపిన అనుభవం ఈ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ది. 

అనేక రెస్క్యూ ఆపరేషన్లలో ఆమె కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2020లో ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక ముఖ్యమైన మిషన్‌ను పర్యవేక్షించారు. ఈ మిషన్లు సుదూర ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు మరియు క్లిష్ట వాతావరణ పరిస్థితులలో నిర్వహించబడ్డాయి.

వింగ్ కమాండర్ సింగ్ తన బాధ్యతలతో పాటు రిస్కీ మిషన్లలో పనిచేసారు. 2021లో 21,650 అడుగుల ఎత్తైన మౌంట్ మణిరంగ్‌ మహిళా క్లైంబింగ్ ట్రిప్‌లో ఆమె పాల్గొన్నారు. ఇలా భారత వాయుసేనలో సీనియర్ స్థాయికి చేరిన వ్యోమికా సింగ్ కు తాజాగా ఆపరేషన్ సింధూరలో పాల్గొనే అవకాశం వచ్చింది.