ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ చెప్పుకున్నారు. కానీ, ఇండియా దాన్ని ఖండించింది. ట్రంప్ కట్టుకథల వెనుక ఉన్న నిజాలేంటో తెలుసుకోండి.
ఆపరేషన్ సింధూర్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 6-7 రాత్రి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీని తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు సైనిక ఘర్షణలు జరిగాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదని అంగీకరించాయి. దాంతో యుద్ధం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలను ఆపిన ఘనత తమదేనని చెప్పుకున్నారు. భారత్ యుద్ధం ఆపడానికి ఒప్పుకోకపోతే వాణిజ్యాన్ని నిలిపివేస్తామని కూడా బెదిరించానని అన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డోనాల్డ్ ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలకు సమాధానమిచ్చింది. సైనిక ఘర్షణలను ఆపడంలో మూడో దేశం పాత్ర లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ట్రంప్, రూబియో చెప్పుకున్న కట్టుకథలు... విదేశాంగ శాఖ స్పందన
అమెరికా : భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం
భారత్: భారత్, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా ఒప్పందం కుదిరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడుల తర్వాత పాకిస్తాన్ చర్చలకు అభ్యర్థించింది.
అమెరికా: అణు యుద్ధం తప్పించాం
భారత్: సాధారణ ఆయుధాలతోనే సైనిక చర్య జరిగింది.
అమెరికా: భారత్‌కు వాణిజ్యం ఆపేస్తామని బెదిరింపు
భారత్: ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాతో వాణిజ్యం గురించి చర్చ జరగలేదు.
అమెరికా: కశ్మీర్ సమస్యకు మధ్యవర్తిత్వం
భారత్: ద్విపాక్షిక చర్చలే జరుగుతాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందడమే లక్ష్యం.
అమెరికా: భారత్, పాకిస్తాన్‌ను ఒక చోటికి తీసుకొచ్చాం
భారత్: భారత్, పాకిస్తాన్‌ను కలపడం లాంటిదేమీ లేదు. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదంపై భారత్‌కు మద్దతుగా నిలిచింది.
అమెరికా: భారత్, పాకిస్తాన్ తటస్థ ప్రాంతంలో చర్చిస్తాయి
భారత్: అలాంటి చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవు.


