భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణాన్ని తానే చ‌ల్ల‌బ‌రిచిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌లుసార్లు చెబుతోన్న విష‌యం తెలిసిందే. కాల్పులు ఆప‌క‌పోతే ఇరు దేశాల‌తో వ్యాపారాన్ని ఆపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్లు కూడా ట్రంప్‌. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఓ రేంజ్‌లో మండిప‌డుతోంది.  

భార‌త్‌, పాక్ యుద్ధాన్ని తానే ఆపాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం సౌదీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ట్రంప్ మాట్లాడుతూ.. ఇండియా – పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనలో తాను కీలక పాత్ర పోషించానని, ఇరు దేశాల‌ పరస్పర దాడులను తాను కాల్పుల విర‌మ‌ణ‌కు ఒప్పించి ఆపించానని చెప్పారు. ఆయన తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మాటల్లో భారత్, పాకిస్తాన్‌లకు ఒకే స్థానం ఇవ్వ‌డాన్ని త‌ప్ప బ‌ట్టింది. ప్రధాని మోదీని, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పోల్చడాన్ని కాంగ్రెస్ త‌ప్ప‌బ‌ట్టింది. 

పవన్ ఖెరా, కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి, ట్రంప్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ ఇలా ట్వీట్ చేశారు: 
“వాణిజ్యాన్ని ఉపయోగించి నేను వాళ్లిద్దరికి ఒప్పందం చేయించాను అని ట్రంప్ మ‌రోసారి అన్నారు’. ట్రంప్‌భారత ప్రధాని మోదీని షెహబాజ్ షరీఫ్‌తో పోల్చారు. ఇది ప్రధాని కార్యాలయానికి సరిగ్గా అనిపిస్తుందా?” అని ప్ర‌శ్నించారు. 

ప్రవీణ్ చక్రవర్తి, కాంగ్రెస్ డేటా విభాగాధ్యక్షుడు ఈ విష‌య‌మై స్పందిస్తూ.. “పాకిస్తాన్ ప్రధాని, ఇండియా ప్రధాని; రెండు దేశాలు సమాన శక్తులుగా ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు? ప్రధాని మోదీకి ‘మంచి స్నేహితుడు’ అయిన ట్రంప్ చెప్పారు.” అని ఎద్దేవా చేశారు. 

ఇదిలా ఉంటే సౌదీ అరేబియాలో జరిగిన ఓ పెట్టుబడి సదస్సులో మాట్లాడుతూ ట్రంప్ మాట్లాడుతూ.. “నా పరిపాలనలో భారత-పాకిస్తాన్ మధ్య తీవ్రత పెరిగిన సమయంలో, ఒక చారిత్రాత్మక సీజ్‌ఫైర్‌ను అమలు చేశాం. నేను ట్రేడ్‌ను ఉపయోగించి వాళ్లిద్దరినీ ఒప్పించాను.‘బాంబులు మార్పిడి చేసుకోవద్దు, మీ దగ్గర ఉన్న మంచి వస్తువులు మార్పిడి చేసుకోండి.’ ఇద్దరూ బలమైన నాయకులు, తెలివైన నాయకులు. అంతా ఆగిపోయింది. అలాగే కొనసాగాలని ఆశిస్తున్నా.” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రంప్‌తో పాటు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు.