india pakistan tension: గురువారం రాత్రి పాకిస్తాన్ భారత్ పై దాడులకు పాల్పడగా.. పాక్ దాడులను భారత్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. దాడుల నేపథ్యంలో సరిహద్దులో ప్రాంతాల్లో బ్లాకౌట్ కొనసాగుతోంది.  

india pakistan tension: సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూ పాకిస్తాన్ భారత్ పై దాడులకు పాల్పడుతోంది. సరిహద్దులో కాల్పులు జరపడంతో పాటు జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాలపై మిస్సైళ్లతో దాడులకు పాల్పడగా, భారత డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ లోయిటరింగ్ మ్యూనీషన్స్ (Loitering Munitions) వాడుతూ దాడులు చేసినట్టు సమాచారం.

భారత వాయుసేన రక్షణ విభాగం వెంటనే ప్రతిస్పందించి యాంటీ-డ్రోన్, కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కిష్త్వార్ జిల్లాలో పూర్తి బ్లాక్‌ఔట్ అమలులోకి వచ్చింది. జమ్మూ ప్రాంతమంతా హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్‌లు మోగించారు. 

జమ్మూ డివిజనల్ కమిషనర్ ప్రకారం, జమ్మూ, సంబా, కఠువా, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు మే 9న మూసివుంటాయి. రాజస్థాన్‌లోని బార్మేర్, బీకానీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్ జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

అంతేకాదు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పరిస్థితుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సమయంలో 0172-2741803, 0172-2749901 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

ఫహల్గాం (ఏప్రిల్ 22) ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన ఘటనపై ప్రతిగా, భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ కింద పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (PoK) తొమ్మిది ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు జరిపాయి.

అయితే, పాకిస్తాన్ మాత్రం భారత్ పై దాడులకు పాల్పడుతోంది. సాధారణ పౌరులను లక్ష్యంగా దాడులు చేస్తోంది. భారత్ పాకిస్తాన్ కు తగిన బుద్ది చెబుతోంది. ఇప్పిటికే పాక్ మిస్పైళ్లను నెలమట్టం చేసింది. పలు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిందని సమాచారం. 

గురువారం ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు మిలిటరీ కేంద్రాలపై పాక్ డ్రోన్లు, క్షిపణులతో దాడి జరిగినట్టు సమాచారం. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృతసర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్ నగరాల్లో దాడులు జరిగాయి.

ఈ దాడులను ఎదుర్కొనేందుకు భారత వాయుసేన 'ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAV గ్రిడ్'ను యాక్టివేట్ చేసి, పలుచోట్ల డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకుంది. గురువారం రాత్రి S-400 'సుదర్శన్ చక్ర' మిస్సైల్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేయగా, పాక్ నుండి వచ్చిన వాయు దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు ANI పేర్కొంది.