కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక, లిబరల్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మోదీ పలు విషయాలను పంచుకున్నారు..
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక, లిబరల్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య సంబంధాల గురించి ప్రస్తావించిన మోదీ, భారత-కెనడా సంబంధాలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
X (ట్విట్టర్)లో మోదీ ఇలా రాసుకొచ్చారు. “కెనడా ప్రధానిగా ఎన్నికైనందుకు @MarkJCarneyకి, లిబరల్ పార్టీ విజయానికి అభినందనలు. భారతదేశం, కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టాల పట్ల నిబద్ధత, ప్రజల మధ్య బలమైన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి.”
“మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసి, మన ప్రజలకు మరింత అవకాశాలు కల్పించడానికి మీతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను” అని ఆయన తెలిపారు.
కార్నీ విజయంతో భారత-కెనడా సంబంధాలు మెరుగవుతాయా
కెనడా సమాఖ్య ఎన్నికల్లో మార్క్ కార్నీ, లిబరల్ పార్టీ విజయం సాధించడంతో, భారత్ తో ఉద్రిక్త సంబంధాలకు ముగింపు పలకవచ్చు. కార్నీ రాకతో, ట్రూడో హయాంలో దెబ్బతిన్న దౌత్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. 2023 సెప్టెంబర్‌లో ట్రూడో, భారత్ పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు దిగజారాయి. కార్నీ మాత్రం కొత్త మార్గం వైపు అడుగులు వేయాలని సంకేతాలు ఇచ్చారు. కెనడా వాణిజ్య వైవిధ్యీకరణకు భారత్ కీలకమని, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు భారత్ కు కీలకం. లిబరల్ పార్టీ, వలసలను, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తోంది. 2025 లిబరల్ మేనిఫెస్టో ప్రకారం, 2027 నాటికి వలసదారుల సంఖ్యను జనాభాలో 5% కంటే తక్కువకు పరిమితం చేయాలని చూస్తున్నారు. శాశ్వత నివాస అనుమతులను కూడా 2027 తర్వాత సంవత్సరానికి 1% కంటే తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
