కట్టుకున్న భర్తే కర్కశంగా ప్రవర్తించాడు. ఎవరి నుంచైనా ఆపద వస్తే రక్షించాల్సిన భర్తే... ఆమె పరువును బజారుకి ఇడ్చాడు. భార్యను నగ్నంగా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. దీనికి  సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానాకు చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 12 ఏళ్ల క్రితం వివాహమయింది. కొంతకాలం పాటు సంతోషంగానే సాగిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక తమ వివాహ జీవితానికి ముగింపు పలకాలని భార్యభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో విడాకుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లోఉంది.

ఇదిలావుండగా.. గతకొంత కాలం నుంచి తన వ్యక్తిగత ఫోటోలను తన భర్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరం కలిసున్న రహస్య చిత్రాలను బయటపెడుతూ.. తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన మానేశ్వర్‌ పోలీసులు, కేసును మహిళా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై మహిళా స్టేషన్‌ అధికారి కవిత మాట్లాడుతూ.. ఐపీసీ సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.