Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఈసీఐపై ఎందుకు వివాదం మొదలైంది?

ఎన్నికల ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఈసీఐ చేపట్టిన SIR ప్రక్రియే తాజా వివాదానికి ప్రధాన కారణంగా మారింది. దీనికి తోడు ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల మధ్య నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న రిపోర్టులు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రికార్డులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటా నిర్వహణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

SIRపై ప్రతిపక్షాల ఆరోపణలు

SIR ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు విధానంలో మార్పులు, డేటా నిర్వహణపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ఓటర్ల కోసం ఉపయోగించే ఫామ్-6లో SIRకు సంబంధించిన అదనపు వివరాలను చేర్చడంపైనా ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు, SIR సహా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల ఆమోదంతోనే జరిగాయని ఈసీఐ స్పష్టం చేస్తోంది.

ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం.కె. స్టాలిన్ కూడా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పలు రాష్ట్రాల్లో నిరసనలు..

జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టగా, ఇతర ప్రాంతాల్లోనూ ఈసీఐ కార్యాలయాల వైపు ర్యాలీలు నిర్వహించే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియకు సంబంధించిన చర్యలను చేపట్టాలని ప్రతిపక్షాలు పరిశీలిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం పనితీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

48 గంటల గడువు విధించిన సీజేపీ

ఈ వివాదంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) కూడా జోక్యం చేసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ‘జంతర్ మంతర్ 2.0’ తరహాలో నిరసన చేపడతామని హెచ్చరించారు. అక్టోబర్ 2, గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. తొలి నిరసన ముంబయిలో నిర్వహించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడాన్ని కూడా దీప్కే ప్రశ్నించారు. ఎన్నికలను బహిష్కరించకుండా పోటీ చేయడం ద్వారా అదే ప్రక్రియకు రాజకీయ చెల్లుబాటు లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఈసీఐ వివాదంలో చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీలో ఈసీఐ కార్యాలయం వద్ద భద్రత పెంపు

వరుస నిరసనలు, ఆందోళనలకు పిలుపుల నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.