- Home
- National
- ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడమే కాదు.. లక్షల మంది చనిపోనున్నారు. భారత్‌లో కూడా
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడమే కాదు.. లక్షల మంది చనిపోనున్నారు. భారత్‌లో కూడా
Super El Nino: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం బలపడుతున్న ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వేడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏకంగా 4.51 లక్షల మంది మరణించే అవకాశం ఉందని అంటున్నారు.

6 నెలల్లో 4.51 లక్షల అదనపు మరణాలు
ఎల్‌నినో ప్రభావంతో 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య ప్రపంచవ్యాప్తంగా సాధారణ సంవత్సరంతో పోలిస్తే సుమారు 4.51 లక్షల అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో అధిక వేడి కారణంగా ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న మరణాలను ఈ అంచనా సూచిస్తోంది. ఇందుకోసం 1996–2025 మధ్య కాలాన్ని సాధారణ పరిస్థితులకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ ప్రమాదం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎక్కువగా ఉండొచ్చని రిపోర్టు పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే కార్మికులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత్‌లో 15,800 మరణాల అంచనా
ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య సుమారు 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా భారత్‌లో ఈ ప్రభావం వచ్చే ఏడాది వేసవిలో కూడా కొనసాగవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే ఎల్‌నినో ప్రభావం ఫిబ్రవరితోనే పూర్తిగా ముగిసిపోతుందని భావించలేం. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల ముప్పు మరింత పెరగవచ్చు.
ఆఫ్రికా, ఆసియాపై ఎక్కువ ప్రభావం
ఈ అంచనా ప్రకారం ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంపై ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు. నైజీరియాలో 31,400, సూడాన్‌లో 17,500, నైజర్‌లో 10,000, చాద్‌లో 8,000 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా కలిపి సుమారు 19,400 అదనపు మరణాలు, ఇండోనేషియాలో 19,300, బ్రెజిల్‌లో 13,300 మరణాలు సంభవించే అవకాశం ఉందని రిపోర్టు పేర్కొంది.
ఎల్‌నినో ఎందుకు ఇంత ప్రమాదకరం?
ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం. దీనివల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు మారిపోతాయి. ప్రస్తుతం ఎల్‌నినో మరింత బలపడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది. ఇది 2026 చివర్లో అత్యంత బలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని WMO పేర్కొంది. అమెరికా వాతావరణ సంస్థ NOAA కూడా 2026 శీతాకాలంలో చాలా బలమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశం 90 శాతానికి పైగా ఉందని తెలిపింది. తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°Cకిపైగా పెరిగినట్లు పేర్కొంది.
వేడి నుంచి రక్షణకు ముందస్తు చర్యలు కీలకం
తీవ్రమైన వేడి పరిస్థితులు ఏర్పడితే ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం, ఎండలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించడం వంటి చర్యలు ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారతాయి. ఆరోగ్య వ్యవస్థలు కూడా హీట్‌వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే 4.51 లక్షల సంఖ్య కచ్చితంగా జరిగే మరణాల సంఖ్య కాదు. ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, చారిత్రక డేటా ఆధారంగా రూపొందించిన అంచనా. ఎల్‌నినో ఎంత బలంగా కొనసాగుతుంది, ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతలు ఎలా మారుతాయి, ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటాయి అనే అంశాలపై వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది.

