ఢిల్లీలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. న్యూ సీమాపురి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది.
ఢిల్లీలో నెల రోజుల క్రితం హాస్టల్ భవనం కూలి ఏడుగురు చనిపోయిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీమాపురిలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు.
న్యూ సీమాపురిలోని ఈద్గా మచ్లీ మండి దగ్గర మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద నుంచి కొందరిని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇంకా ముగ్గురు లేదా నలుగురు లోపల చిక్కుకుని ఉండొచ్చని డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు. 225 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిందని, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన వివరించారు.
అంబులెన్స్‌లు, ఇతర సహాయక వాహనాలు వచ్చేందుకు వీలుగా ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లొద్దని ఢిల్లీ పోలీసులు ఎక్స్ లో కోరారు. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని, ఓ చిన్నారి శిథిలాల కింద చిక్కుకుందని స్థానికులు చెప్తున్నారు. కొందరిని మాత్రం రక్షించి ఆసుపత్రికి పంపినట్లు ఓ స్థానికుడు తెలిపాడు.
మంగళవారం రాత్రి వచ్చిన భూకంపం వల్లే భవనంలో పగుళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి అసలు కారణం ఏంటో చెప్పగలమని అధికారులు స్పష్టం చేశారు.
నైరుతి ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఓ హాస్టల్ భవనం కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత ఢిల్లీలో జరిగిన మరో పెద్ద ప్రమాదం ఇది. సెప్టెంబర్ 6న సత్యనికేతన్‌లో ఐదు అంతస్తుల హాస్టల్ భవనం కుప్పకూలింది. ప్రమాదానికి 10 రోజుల ముందు చేసిన రిపేర్ల వల్లే భవనం పునాదులు బలహీనపడ్డాయని, అదే ఈ ఘోరానికి కారణమని ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఆ ఘటనలో భవనం యజమానితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.


