- Home
- National
- ఎట్టకేలకు తిరుప్పరన్కుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం.. అసలు వివాదం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు తిరుప్పరన్కుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం.. అసలు వివాదం ఏంటో తెలుసా.?
Karthigai Deepam: తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీక మహాదీపం వెలిగింది. దశాబ్దాలుగా వివాదానికి కేంద్రంగా ఉన్న పురాతన రాతి స్తంభం (దీపతూన్)పై శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఆలయ పూజారులు జ్యోతిని వెలిగించారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న దీప ప్రజ్వలన వివాదం
తిరుప్పరన్కుండ్రం కొండపై కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. కొండ మిడిల్ భాగంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయ మండపం వద్దనే దశాబ్దాలుగా మహాదీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే కొండ శిఖరాగ్రానికి సమీపంలో ఉన్న పురాతన రాతి స్తంభం (దీపతూన్) వద్ద దీపం వెలిగించాలంటూ భక్తులు, హిందూ సంఘాలు 1990ల నుంచి పోరాటం చేస్తున్నాయి. ఈ వివాదానికి కొండ యాజమాన్య హక్కులకు సంబంధించిన పాత న్యాయపోరాటంతోనూ సంబంధం ఉంది. 1920లో ప్రారంభమైన సివిల్ దావాలో దర్గా, దాని పరిసర ప్రాంతాలు మినహా మిగిలిన కొండ భాగం ఆలయానికి చెందుతుందని 1923లో కోర్టు తీర్పునిచ్చింది. 1931లో ప్రివీ కౌన్సిల్ కూడా ఈ తీర్పును సమర్థించింది. అయినప్పటికీ దీపతూన్ వద్ద దీపం వెలిగించే అంశంపై వివాదం కొనసాగింది. ఈ క్రమంలో భక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
హైకోర్టు ఉత్తర్వులు.. సుప్రీంకోర్టు జోక్యం
దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలనే డిమాండ్‌పై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం గతంలో అనుకూల ఉత్తర్వులు జారీ చేసింది. 2025 డిసెంబర్, 2026 జనవరిలో ఈ అంశంపై కీలక ఆదేశాలు వెలువడ్డాయి. అయితే క్షేత్రస్థాయిలో వాటి అమలు జరగకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో 2026 నవంబర్ 20న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఇంటర్నమ్ అనుమతి ఇచ్చింది. అయితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం అక్కడ దీపం వెలిగించలేదు. సంప్రదాయం ప్రకారం ఉచ్చిపిళ్లైయార్ ఆలయ మండపం వద్దే మహాదీపాన్ని వెలిగించింది. దీంతో భక్తులు, పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు ధిక్కరణ నోటీసులు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపతూన్ వద్ద దీపం వెలిగించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నవంబర్ 27న ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా శనివారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పురాతన రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేస్తూ, కార్యక్రమం పర్యవేక్షణ కోసం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. వారి పర్యవేక్షణలోనే దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
Vetrivel Muruganukku Arogara
The light of faith will always shine brighter than the forces that seek to extinguish it. https://t.co/5sDNq7jPo4
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) November 28, 2026
సీఆర్పీఎఫ్ బలగాల భద్రతలో దీప ప్రజ్వలన
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుప్పరన్కుండ్రం కొండపై భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్) భద్రతా బాధ్యతలు చేపట్టాయి. కొండపైకి భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించి, పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మొత్తం 50 మందిని మాత్రమే కొండపైకి అనుమతించినట్లు సమాచారం. మరోవైపు కొండపై ఉన్న సికందర్ బాదుషా దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. ముస్లిం భక్తులు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణతో పాటు ఇతర అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కొండపై ఉన్న దీప మండపంలో ఇప్పటికే వెలుగుతున్న మహాదీపం నుంచి అగ్నిజ్వాలను తీసుకొచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పూజారులు పురాతన దీపతూన్పై కార్తీక జ్యోతిని వెలిగించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
జ్యోతి వెలగడంతో భక్తుల సంబరాలు..
దీపతూన్పై కార్తీక మహాదీపం వెలిగే ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో కొండ దిగువ ప్రాంతానికి చేరుకున్నారు. కొండపైకి వెళ్లేందుకు పరిమితులు ఉండటంతో వేలాది మంది కిందనే ఉండి జ్యోతి ప్రజ్వలన కోసం ఎదురుచూశారు. సాయంత్రం 5 గంటలకు దీపం వెలగగానే భక్తులు హర్షధ్వానాలు చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కొండపైకి చేరుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బందికి కొందరు స్థానికులు పూల వర్షంతో స్వాగతం పలికారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం, కోర్టుల జోక్యం, ప్రభుత్వానికి ఎదురైన కోర్టు ధిక్కరణ హెచ్చరికల నేపథ్యంలో ఈ దీప ప్రజ్వలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు వందేళ్ల తర్వాత పురాతన రాతి స్తంభం వద్ద కార్తీక జ్యోతి వెలగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ సంప్రదాయాలు, మతపరమైన హక్కులు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై తమిళనాడులో ఈ ఘటన మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు తెరలేపింది.











