మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. అతడికి న్యాయస్థానం జీవితఖైదు శిక్షను ఖరారు చేసింది.
బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది. హోళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మొదటి అత్యాచార కేసులో ఈ శిక్ష పడింది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను నిన్న(శుక్రవారం) ఈ కేసులో దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఇవాళ(శనివారం) జీవితఖైదు శిక్ష ఖరారు చేసింది.
హాసన్‌లోని తమ కుటుంబ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళపై రేవణ్ణ రెండుసార్లు అత్యాచారం చేసినట్లు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఫామ్‌హౌస్‌లోనే అత్యాచారం చేసాడట. 2021లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో బెంగళూరులోని బసవనగుడిలోని తన ఇంట్లో మరోసారి అత్యాచారం చేసాడని పోలీసులు చెబుతున్నారు.
అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు, రూ.10 లక్షల జరిమానా
ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గజానన భట్ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2)(k), 376(2)(n) కింద రేవణ్ణను దోషిగా నిర్ధారించింది. ఈ రెండు సెక్షన్ల కింద జీవిత ఖైదు విధించబడింది. అదనంగా కోర్టు సెక్షన్ 354 (మహిళ మర్యాదకు భంగం కలిగించడం) కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 354B ( దాడి లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం) కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి ఎదురుదెబ్బ. లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుత లేదా మాజీ ఎంపీకి ఇంత కఠినమైన శిక్ష పడటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రత్యేక కోర్టు ప్రజ్వల్‌పై సెక్షన్ 376(2)(k) (మహిళపై అత్యాచారం చేయడం), 376(2)(n) (ఒకే మహిళపై పదేపదే అత్యాచారం చేయడం), 354A (లైంగిక వేధింపులు), 354B, 354C, 506 (క్రిమినల్ బెదిరింపులు), 201 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద అభియోగాలు మోపింది.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ ఏసియా నెట్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఈ ఏడాది మే 2న ప్రారంభమైన విచారణ సందర్భంగా 26 మంది సాక్షులను ప్రశ్నించినట్లు తెలిపారు. "వాదన తేదీలతో సహా విచారణ పూర్తి చేయడానికి 38 వాయిదాలు/తేదీలు పట్టింది. ప్రాసిక్యూషన్ 26 మంది సాక్షులను పరీక్షించి 180 డాక్యుమెంట్లను ఎగ్జిబిట్‌లుగా గుర్తించింది" అని ఆయన అన్నారు.
రేవణ్ణ పరిస్థితేంటి?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రజ్వల్ రెవణ్ణకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేయవచ్చు. హైకోర్టు స్టే ఇస్తే మిగిలిన మూడు పెండింగ్ కేసుల్లో బెయిల్ కోసం కూడా ప్రయత్నించవచ్చు.
అయితే హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తే, అతని చివరి అవకాశం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడం. అత్యున్నత న్యాయస్థానం కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తే, రేవణ్ణకు పూర్తి శిక్ష అనుభవించడం తప్ప వేరే మార్గం ఉండదు.
ఇదిలా ఉండగా శనివారం కోర్టు హాలు న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, ప్రేక్షకులతో నిండిపోయింది. అందరూ ఒక హై-ప్రొఫైల్ రాజకీయ నాయకుడికి న్యాయం జరుగుతున్నట్లు చూశారు. ప్రాసిక్యూషన్‌కు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బి.ఎన్. జగదీష్, ఎస్.పి.పి. అశోక్ నాయక్ నాయకత్వం వహించారు.
