Prajwal Revanna : బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్...
ఎట్టకేలకు మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు చిక్కాడు. అతడు చాలామంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకు వచ్చాయి. ీదీన్ని సీరియస్ గా తీసుకున్నసిద్దరామయ్య సర్కార్ అరెస్ట్ చేసేవరు వదల్లేదు.
బెంగళూరు : తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవే గౌడ్ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టయ్యాడు. జర్మనీ నుండి బయలుదేరి గత అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు రేవణ్ణ. అతడి రాకపై సమాచారం వుండటంతో ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేసారు. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది... దీంతో అరెస్ట్ కాక తప్పలేదు.
అయితే లైంగిక వేధింపులు వ్యవహారం బయటపడటంతో విదేశాల్లో వున్న ప్రజ్వల్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాను మహిళలను వేధించిన విషయం బయటపడుతుందని ముందుగానే తెలిసి ప్రజల్ విదేశాలకు పారిపోయాడని అనుమానం వ్యక్తం చేసారు. అతడు పారిపోడానికి జేడి(ఎస్) మిత్రపక్షం బిజెపి సహకరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఇలా లోక్ సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ వ్యవహారం దుమారం రేపింది... పరిస్థితి జేడి(ఎస్), బిజెపిలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రజ్వల్ కుటుంబసభ్యుల అండ కూడా కోల్పోయాడు. అతడిని తాత దేవే గౌడ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు... తండ్రి రేవణ్ణ, బాబాయ్ కుమారస్వామి కూడా ఇండియాకు వచ్చి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు.
కుటుంబసభ్యుల సూచన మేరకు గత సోమవారమే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మొదటిసారి నోరు విప్పాడు ప్రజ్వల్. తాను ఎక్కడికీ పారిపోలేదని... ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కోసం విదేశాలకు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 31న అంటే ఇవాళ ఇండియాకు వస్తానని... లైంగిక వేధింపుల ఆరోపణల విచారణపై ఏర్పాటుచేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ముందు హాజరవుతానని ప్రజ్వల్ రేవణ్ణ వెల్లడించాడు. అన్నట్లుగానే ఆయన జర్మనీ నుండి స్వదేశానికి వచ్చాడు. అతడు బెంగళూరు ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసారు.
ప్రజ్వల్ లైంగిక వేధింపుల వ్యవహారమేంటి?
కర్ణాటక రాజకీయాల్లో జనతాదళ్ సెక్యులర్ (JDS)ది కీలకపాత్ర. జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ హవా ఎక్కువగా వుండే కర్ణాటక రాజకీయాల్లో అప్పుడప్పుడు జెడిఎస్ కింగ్ మేకర్ గా మారుతుంది. ఇలా గతంలో జేడిఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ బాగా దెబ్బతింది... దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఎన్డిఏలో చేరిన జేడిఎస్ హసన్ ఎంపి అభ్యర్థిగా మళ్లీ ప్రజ్వల్ నే బరిలోకి దింపుతోంది.
కర్ణాటకలో లోక్ సభ పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజ్వల్ కు చెందిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. మహిళలతో అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హసన్ జిల్లాలోని చాలామంది మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఈ సోషల్ మీడియా వీడియోల సారాంశం. లైంగిక వేధింపుల వీడియోలు బయటకు వచ్చేముందే ప్రజ్వల్ జర్మనీకి వెళ్ళిపోయారు.
కానీ కర్ణాటక కాంగ్రెస్ మహిళా విభాగం మాత్రం ప్రజ్వల్ వీడియోలను సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రజ్వల్ వీడియోలపై విచారణ జరపాలని... నిజంగానే తప్పు చేసాడని తేలితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నాగలక్ష్మి కూడా ప్రజ్వల్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సీం సిద్దరామయ్యకు లేఖ రాసింది. దీంతో స్పందించిన సీఎం రాష్ట్ర సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ బిజయ్ సింగ్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటుచేసారు. ఈ సిట్ బృందమే ఇవాళ ప్రజ్వల్ ను అరెస్ట్ చేసారు.